హైదరాబాద్ – ఫోర్త్ సిటీ పేరుతో భూ మాపియాకు తెరలేచిందని ఆరోపించారు మాజీ మంత్రి , బిఆర్ఎస్ నేత హరీశ్ రావు.. ఆ సిటీ పేరు చెప్పి ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని అన్నారు.. కందుకూరులో 385 ఎకరాలు సర్వే నంబర్ 9లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారని.. తుక్కుగూడలో 25 ఎకరాలు సర్వే నంబర్ 895లో పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారని.. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చలామణీ అవుతున్న తమ్ముళ్ల పీఏల పేరుమీద భూములు కొంటున్నారన్నారు.
బిఆర్ఎస్ భవన్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడుతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గిందని.. రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డీకే అరుణను గెలిపించారని విమర్శించారు. రుణమాఫీపై తాము రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండి ఎందుకు? అని ప్రశ్నించారు.
సుప్రీం తీర్పును తప్పుపట్టడం నేరం
సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరమని హరీశ్‌రావు అన్నారు. వక్రబుద్ది ఉంటే అన్ని వంకరగా కనిపిస్తాయని.. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా..? అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. కవిత బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచిందని.. ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్నారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా..? అంటూ నిలదీశారు.
మొదట బుద్ధ భవన్, జీహెచ్‌ఎంసీని కూల్చండి
బుద్ధ భవన్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం నాలాపై ఉన్నాయని.. మొదట వాటిని కూల్చాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి భవనాలు ఎలా కూలగొడుతారని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్, హోటల్స్, క్లబ్స్ దేని కింద ఉన్నాయని ప్రశ్నించారు. మీర్‌ఆలం, ఉప్పల్, రామంతాపూర్ చెరువులో పెద్దపెద్ద టవర్లు ఉన్నాయని.. అవన్నీ పట్టాభూములు.. వారికి పరిహారం ఇవ్వాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే హైడ్రా పరిధిలోని ఆక్రమణలు కూల్చివేయాలన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్, నాలాలపై ఉన్న ఆస్తులను కూల్చివేయాలన్నారు.