Friday, November 22, 2024

Adilabad Bandh : లంబాడీల‌ను ఎస్టీల నుంచి తొల‌గించాల్సిందే… తుడుం దెబ్బ‌

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో జీవో నెంబర్ 3 పకడ్బందీగా అమలు చేసి, వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ తో ఆదివాసి సంఘాలు మంగళవారం ఇచ్చిన బంద్ పిలుపు మేర‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏజెన్సీ ఏరియాలో దుకాణాలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఇవాళ‌ ఉదయమే ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట తుడుందెబ్బ నాయకులు బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. 40శాతం ఆదివాసీ జనాభా ఉన్న గ్రామాలను ఏజెన్సీగా ప్రకటించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసుల హక్కులు కాపాడేందుకు జీవో నెంబర్ 3ని పకడ్బందీగా అమలు పర్చాలని డిమాండ్ చేశారు.

పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలో బంద్ ప్రశాంతంగా సాగడంతో మార్కెట్ వీధులన్నీ బోసిపోయాయి. తీర్యానీలో ఆదివాసీ సంఘాలు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపాయి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనూ బంద్ స్వచ్ఛందంగా ప్రశాంతంగా కొనసాగింది. ఇచ్చోడ కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ల సాధన కోసం ఆందోళన నిర్వహించి దుకాణాలు అన్నింటిని మూసి వేయించారు. ఆదివాసీ 9 తెగల సంఘాలు బందు పిలుపును విజయవంతం చేశాయి.

ఆదివాసీ విద్యార్థి యువజన సంఘాలు సైతం ఆందోళనలో పాల్గొన్నాయి. వలస వచ్చిన లంబాడీలతో తాము హక్కులు రిజర్వేషన్లు కోల్పోతున్నామని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, జిల్లాకు కన్వీనర్ ఉయిక ఇందిరా, రేణుక, నాయకులు వెట్టి మనోజ్ పేర్కొన్నారు. ఏజెన్సీలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బజార్హత్నూర్ గుడిహత్నూర్, సిర్పూర్ జైనూర్, కెరమెరి, నార్నూర్ మండలాల్లో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాలకు బస్సులు నడవలేదు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement