నిజామాబాద్ ప్రతినిధి (ప్రభా న్యూస్) : నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయి. ఎగ్జిబిషన్‌కు వచ్చిన సందర్శకుడిపై అమూజ్మెంట్ నిర్వాహకులు, సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేయగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొద్ది రోజుల క్రితం ఎగ్జిబిషన్‌కు వచ్చిన సందర్శకులతో అమూజ్మెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో, సందర్శకులలో ఒకరిని అమూజ్మెంట్ నిర్వాహకులు, సిబ్బంది తలపై దాడి చేయడంతో అతని తల పగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం బాధితుడు నగరంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేసి బాధ్యులపై కేసు నమోదు చేశారు.
ఎగ్జిబిషన్లో శాంతిభద్రతలు కరువు…
నిబంధనల ప్రకారం ఇంత పెద్ద ఎగ్జిబిషన్ నిర్వహించేటప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ పోలీసు బందోబస్తు నిర్వహించాలి. అయితే ఇవేమీ పట్టించుకోనట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. పోకిరీలకు ఎగ్జిబిషన్ అడ్డాగా మారింది.