ప్రభ న్యూస్ బ్యూరో అదిలాబాద్: జనవరి 4: ఎరువుల కోసం నిద్రాహారాలు మాని అర్ధరాత్రి నుండి రైతులు బారులుతీరి, చెప్పుల వరసలు, లాటీ చార్జీల ఉదంతాలు ఇప్పటికీ మనం మర్చిపోము. తిరిగి అలాంటి సంఘటనలే ఇప్పుడు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కొత్తగా అభయ హస్తం, గ్యారెంటీ పథకాలకు ఆధార్ తప్పనిసరి అని , గ్యాస్ కనెక్షన్లు, రాయితీల కోసం ఈ కేవైసీ ద్వారా ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ హుకుం జారీ చేసింది. జనవరి 31 వరకు చివరి గడువు ఉన్నప్పటికీ, ప్రజా పాలన గ్రామసభల్లో ఆర్జీలు సమర్పించుకునేందుకు ఆధార్ కార్డు అప్డేట్ తో జనం మీసేవ కార్యాలయాలు తాసిల్దార్ కార్యాలయం చుట్టూ పొద్దస్తమానం ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.
ఆహార భద్రత కార్డు కలిగియున్న రేషన్ కార్డుదారులందరూ కొత్త రేషన్ కార్డుల కోసం ఆధార్ తో పాటు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ సభల్లో బారులు కడుతున్నారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం కేవలం ఐదు కేంద్రాలు మాత్రమే ఆధార్ అప్డేట్ కోసం తెరవడంతో వివిధ గ్రామాల ప్రజలు, కాలనీవాసులు అన్ని పనులు వదులుకొని ఉదయం లేచి లైన్లు కడుతున్నారు. గురువారం ఉదయం ఏడు గంటల చలిలో మావల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ప్రజలు బారులు తీరి వేచి ఉండటం గమనార్హo .వేకువ జామున వచ్చిన వందలాది మంది పేద ప్రజలు మావల తాసిల్దార్ ఆఫీస్ ఎదుట ఇలా చెప్పులు వరుసలు పెట్టుకొని నిరీక్షించడం కనిపించింది. ఆధార్ కార్డులకు ఈ కేవైసీ అప్డేట్ ఇప్పటివరకు 65% పూర్తయిందని, జనవరి 31 తేదీ వరకు గడువు ఉన్నందున గాబరాపడాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెల్చి చెప్తున్నారు.