ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : కారు ఇక్కడ.. బేకారు అక్కడ.. కాంగ్రెస్ కు ఓటేస్తే రాష్ట్రం అంధకారమేనని, గాడిదకు గడ్డి వేసి అవుకు పాలు పిండితే వస్తాయా. అని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో పాల్గొని మాట్లాడారు. మునుగోడును దత్తత తీసుకున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కారు ఇక్కడ ఉంది.. బేకారు అక్కడ ఉంది.. మునుగోడు ప్రజలను అంగడి సరుకుల్లా కొనేందుకు డబ్బు మదంతో పచ్చి రాజకీయ వాది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ ముందుకు వస్తున్నాడు.. డబ్బు మదాన్ని అణిచివేసే సత్తా మీ మీద ఉంది..30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. డబ్బు మదంతో అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డిని చిత్తుగా ఓడించాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఫ్లోరైడ్ తో బాధలు పడ్డారన్నారు. అలాంటి కాంగ్రెస్ మళ్ళీ వచ్చి మభ్యపెట్టాలని చూస్తున్నారు…ఉద్యమ సమయంలోనే ఫ్లోరైడ్ ప్రాంతాల్లో పర్యటించిన తాను ఈ ప్రాంత సమస్యలు తనకు తెలుసన్నారు.
ఇవ్వాళ ఇంటింటికి మంచి నీళ్ళు అందిస్తున్నాం.. సురక్షిత నదీ జలాలు అందిస్తున్నాం… ఫ్లోరైడ్ ను అంతం చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అన్నదాతలకు రైతు బంధు ఆర్థిక సాయం అందిస్తున్నం. కోమటిరెడ్డి సోదరులకు కరెంట్ కనబడటం లేదు… కాంగ్రెస్ వాళ్లు కరంట్ వైర్లు పట్టుకోవాలి.. అప్పుడు కరంట్ వస్తుందో లేదో తెలిస్తుందన్నారు. ధరణి వద్దు, రైతు బంధు వద్దు అంటున్నారు ఉత్తమ్, రేవంత్, భట్టి .. కరంట్ కావాలంటే బీఆర్ఎస్ రావాలి.. కరంట్ వద్దు అనుకుంటే కాంగ్రెస్ కు ఓటయ్యాలన్నారు. డిసెంబర్ 3 తర్వాత సౌభాగ్య లక్ష్మీ పథకం కింద రూ.3 వేలు పెన్షన్ ఇస్తాం… వృద్ధులకు రూ.5 వేలు అందిస్తాం. సిలిండర్ ను రూ. 400కి అందిస్తాం… అసైన్డ్ భూములకు హక్కులు అందిస్తాం… నేతన్నలను చేనేత మిత్ర కింద రూ.5 వేలు అందిస్తాం… రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకు సన్న బియ్యం ఇస్తాం.. భీమా కల్పిస్తాం… చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తాం.. ఆసుపత్రి నిర్మిస్తాం… మునుగోడు మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తాం… మునుగోడును దత్తత తీసుకున్న… ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. కారు గుర్తుకు ఓటేసి కుసుకుంట్లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్నె ప్రభాకర్, రాపోలు ఆనంద్ భాస్కర్, పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, నాయకులు పాల్గొన్నారు. భారాస నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.