Thursday, December 5, 2024

KTR – మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తాం … రాజీవ్ విగ్ర‌హం స్థానంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం పెడ‌తాం ..

హైద‌రాబాద్ – తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన బుద్ధి కురచ బుద్ధి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి.. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుతున్నారని విమర్శించారు. తన ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి విరమించుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. లేదంటే.. నాలుగేళ్ల తరువాత జరగాల్సిన కార్యక్రమం జరిగి తీరుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టిన స్థానంలో భవిష్యత్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని తేల్చి చెప్పారు. 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేసిన కేటీఆర్.. తెలంగాణ సమాజం గొప్పతనానికి తెలంగాణ తల్లి నిదర్శనం అని పేర్కొన్నారు. కానీ, నేడు తెలంగాణ తల్లిని పేదరికానికి నిదర్శనంగా రేవంత్ రెడ్డి మార్చారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఆనావాళ్ళు రూపుమాపుతాననటం ఆయోదయోగ్యం కాదన్నారు. ఇందిరాగాంధీ ప్రతిష్టించిన భరతమాత రూపాన్ని వాజపేయి మార్చలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. లేకీ వ్యక్తి, కురుస బుద్ది కలిగిన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ పెట్టిన‌ విగ్రహాల గురించి మాట్లాడే రేవంత్.. కేసీఆర్ పెట్టిన‌ అంబేడ్కర్‌ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నూతన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ కేసీఆర్ విజన్‌కు నిదర్శనం అని పేర్కొన్నారు. పరాజితుల చరిత్రను చెరిపే మూర్ఖపు కుట్రకు రేవంత్ తెరతీశారని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ ఏడాది పాలనపై తీవ్ర వ్యాఖ్యలు..

- Advertisement -

కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం? అని ప్ర‌శ్నించారు కెటిఆర్. రేవంత్ రెడ్డి సన్నాసి‌ ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. తప్పుడు కూతలు కూస్తోన్న రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. రుణమాఫీ పాక్షికంగా మాత్రమే జరిగిందన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్న దాని ప్రకారం రాష్ట్రంలో రూ. 11, 12వేల కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు.

డబ్బు సంచులతో దొరికిన దొంగ రేవంత్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. దొంగనే దొంగ అన్నట్లు ముఖ్య‌మంత్రి వ్యవహారముందని విమర్శించారు. గురుకుల విద్యార్థులను బీఆర్ఎస్ ఎవరెస్ట్ ఎక్కించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాడె ఎక్కిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఇదో ప్రభుత్వం, మీదో బతుకు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల్లో ఫాంహౌస్ ఉందని నిరూపిస్తే రేవంత్ కే రాసిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ పాలనలో ప్రజలకు తిప్పులు.. తెలంగాణకు లక్షల కోట్లు అప్పులే మిగిలాయన్నారు. జోసెఫ్ గోబెల్ ఆదర్శంగా ముఖ్యమంత్రి, మంత్రులు పాలన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎనుములు బ్రదర్స్ మాత్రమే బాగుపడ్డారని కేటీఆర్ ఆరోపించారు.

తెలంగాణ రైజింగ్ కాదు.. రేవంత్ బ్రదర్స్ రైజింగ్.. తెలంగాణ ఫాలింగ్ నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. భవిష్యత్‌లో రేవంత్ బ్రదర్స్ ఆస్తులు అదానీని దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసం లేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీకే కళంకం తీసుకొచ్చారన్నారు. కేసీఆర్‌ను తిట్టుడు.. దేవుళ్ళ మీద ఒట్లు తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రైజింగ్ ఎట్లనో సీఎం రేవంత్ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కేసీఆర్ గాయం, కవిత అరెస్ట్ సహా‌.. ఏడాదిగా అనేక ఆటు పోట్లు ఎదుర్కొన్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఏడాది కాలంగా కేసులను సైతం తట్టుకుని నిలబడ్డామన్నారు. కాంగ్రెస్ బాధితులతో తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌గా మారిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరో నాలుగేళ్లు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అప్పుల మీద కాదు.. రేవంత్ రెడ్డి తప్పుల మీద ప్రజల్లో చర్చ జరగాలన్నారు. 2 లక్షల ఉద్యోగాల హామీనిచ్చిన రేవంత్, రాహుల్ గాంధీ బండారం బయటపెడతామన్నారు. రేవంత్ చేస్తున్న అరాచ‌కాల‌పై రాహుల్ గాంధీకి లేఖ రాస్తామ‌న్నారు కెటిఆర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement