మీ నియోజకవర్గానికే వెళ్దాం
సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
సెక్యూరిటీ లేకుండా బయటకు రండి
ప్రజలే మిమ్మల్ని ఫుట్ బాల్ ఆడతారు
30శాతం రుణ మాఫీ చేసి వంద శాతం అంటారా?
ఇంత పచ్చి మోసం, దగా చేయడం మీకే చెల్లింది
తెలంగాణ భవన్‌లో మీడియా మీట్..
విరుచుకుపడ్డ కేటీ రామారావు
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రుణమాఫీ పైన సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్, ఇతర సీనియర్ పార్టీ నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ… మీరు చేసిన రుణమాఫీ నిజమైతే…మీ నియోజకవర్గం కొడంగల్ కు మీడియాతో కలిసి వెళ్దామన్నారు. రుణమాఫీపై ఆయన చెప్పింది నిజమని, 100 శాతం రుణమాఫీ అయిందని రైతులు చెబితే తాను పదవికి రాజీనామా చేసి, రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. ఏదైనా ఒక్క రైతు వేదికలో 100 శాతం రుణమాఫీ అయినట్లు చెప్పించగలరా? అని ప్రశ్నించారు. . సీఎంకు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నానన్నారు.
సెక్యూరిటీ లేకుండా….
ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు తిరిగి…. ఎంతమందికి రుణమాఫీ అయిందో వెలికి తీస్తారన్నారు. రైతు రుణమాఫీ పేరుతో మోసం చేశారని ఆరోపించారు. రుణమాఫీని గత ఏడాది డిసెంబర్ 9 నుంచి ఆగస్ట్ 15 వరకు జాప్యం చేశారన్నారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు 9 నెలల వడ్డీని ఎవరు కడతారో చెప్పాలని నిలదీశారు. 22.37 లక్షల మంది రైతులకు… రూ.17,934 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారన్నారు. రుణమాఫీ 40 శాతం మాత్రమే అయిందన్నారు. అరవై శాతం మందికి రుణమాఫీ ఎగ్గొట్టారన్నారు. రుణమాఫీలో అనేక కోతలు పెట్టారన్నారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్‌లా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు రుణమాఫీకి కొర్రీలు చెప్పని కాంగ్రెస్… ఇప్పుడు మాత్రం ఎన్నో కొర్రీలు పెడుతోందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ మోసం… కేసీఆర్‌పై ద్వేషం… ఇదే ఈ ప్రభుత్వం తీరు అన్నారు. రుణమాఫీ, ఉద్యోగాలు, ఆడపడుచులకు తులం బంగారం, నెలకు రూ.2500, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, దళితులకు రూ.12 లక్షలు, ఆటో అన్నలకు ఏడాదికి రూ.12 వేలు, రైతు కూలీలకు నెలకు రూ.1000… ఇలా అన్నింటా మోసమే చేశారన్నారు.
ఏకకాలంలో రుణమాఫీ అని ఎవరైనా మూడుసార్లు ప్రకటన చేస్తారా? ఏదో పాత గోడకు కొత్త సున్నం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఏకకాలంలో అంటే ఒకేసారి చేయాలి… ఒకేసారి ప్రకటన ఇవ్వాలన్నారు. అయినా ముఖ్యమంత్రికి పాత గోడకు కొత్త సున్నం వేసిన అనుభవం ఉన్నట్లుగా ఉందని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి అడ్డమైన ఫీట్లు చూసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా ఈ మోసాలను చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు.