హైదరాబాద్‌లో మెట్రో ట్రైన్ సేవలను ఉదయం 6 గంటల నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని.. అభినవ్ అనే ప్రయాణికుడి ట్విట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు కోసం ప్రయాణికులు స్టేషన్లకు వస్తున్నారని చెప్పారు. కానీ మెట్రో 7 గంటలకు ప్రారంభమవుతుండటంతో సుమారు గంటపాటు వేచిచూడాల్సి వస్తోందని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఉదయం సమయంలో క్యాబ్‌ల రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని దీనిని పరిశీలించాలని అభినవ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉదయం 6 గంటల నుంచే మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే అంశం పరిశీలించాలని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
కాగా, తెలంగాణలో లాక్ డౌన్ అనంతరం దశల వారిగా మెట్రో సర్వీసులను పెంచారు. ప్రస్తుతం మెట్రో రైళ్లు మొదటి స్టేషన్ల నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతున్నాయి. చివరి స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు చివరి ట్రైన్ నడుపుతున్నారు. కరోనా సందర్భంగా కర్ఫ్యూ ఆంక్షలకు ముందు ఉదయం 6 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యేవి. కొవిడ్ తీవ్రత, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో ఉదయం 7 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతున్నాయి. ఇటీవల కేసులు తగ్గిపోవడం, వ్యాపార, ఉద్యోగ కార్యాలయాలన్ని యధావిధిగా సాగడంతో మెట్రోలో రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో మెట్రో సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.