Wednesday, November 20, 2024

మెట్రో సర్వీస్​పై కేటీఆర్​కు ట్వీట్.. మంత్రి ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో మెట్రో ట్రైన్​ సేవలను ఉదయం 6 గంటల నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని.. అభినవ్‌ అనే ప్రయాణికుడి ట్విట్‌పై మంత్రి కేటీఆర్​ స్పందించారు. ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు కోసం ప్రయాణికులు స్టేషన్లకు వస్తున్నారని చెప్పారు. కానీ మెట్రో 7 గంటలకు ప్రారంభమవుతుండటంతో సుమారు గంటపాటు వేచిచూడాల్సి వస్తోందని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను కేటీఆర్​కు ట్వీట్‌ చేశారు. ఉదయం సమయంలో క్యాబ్‌ల రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని దీనిని పరిశీలించాలని అభినవ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉదయం 6 గంటల నుంచే మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే అంశం పరిశీలించాలని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి కేటీఆర్​ రీట్వీట్‌ చేశారు.

కాగా, తెలంగాణలో లాక్ డౌన్ అనంతరం దశల వారిగా మెట్రో సర్వీసులను పెంచారు. ప్రస్తుతం మెట్రో రైళ్లు మొదటి స్టేషన్ల నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతున్నాయి. చివరి స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు చివరి ట్రైన్ నడుపుతున్నారు. కరోనా సందర్భంగా కర్ఫ్యూ ఆంక్షలకు ముందు ఉదయం 6 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యేవి. కొవిడ్ తీవ్రత, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో ఉదయం 7 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతున్నాయి. ఇటీవల కేసులు తగ్గిపోవడం, వ్యాపార, ఉద్యోగ కార్యాలయాలన్ని యధావిధిగా సాగడంతో మెట్రోలో రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో మెట్రో సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement