హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పక్క రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్‌కు అర్థమైంది. కానీ రాష్ట్రంలోని విపక్షాలకు అర్థం కావడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో చేపట్టిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ, హైదరాబాద్ అభివృద్ధిని, భూముల విలువను చంద్రబాబు గుర్తించారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఒప్పుకున్న చంద్రబాబుకు ధన్యవాదాలు. కేసీఆర్‌కు రైతులపై ప్రేమ ఉన్నందునే మీటర్లకు ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను ఏపీ సీఎం జగన్ కూడా మెచ్చుకున్నారు. దిశ ఘటన విషయంలో ఐ సెల్యూట్ టు కేసీఆర్ అని జగన్ కూడా అన్నారు. తెలంగాణ శాంతి భద్రతలను మెచ్చుకున్న జగన్‌కు కూడా ధన్యవాదాలు. జగన్, చంద్రబాబుకు అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావట్లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు నల్లాల ద్వారా అందుతుందని కేంద్ర మంత్రినే పార్లమెంట్‌లో ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే వచ్చాయన్నారు. గత 9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 29 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని. కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో పెట్టిన ఖర్చు రూ. 6 వేల కోట్లు మాత్రమే నని లెక్కలతో సహా సభ ముందుంచారు కెటిఆర్. కాంగ్రెస్ హయాంలో మానేరు ఒడ్డున ఉన్నవారికి కూడా మంచినీరు అందేది కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ 60 ఏండ్లలో చేయని పనులను 6 ఏండ్లలోనే చేసి చూపించామని, రాష్ట్రంలో 24 వేల ఆవాసాలకు నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా లక్షన్నర కిలోమీటర్ల పైపులైన్లు వేశామన్నారు. నీళ్ల కోసం ఆనాడు నీళ్ల మంత్రి జానారెడ్డి దగ్గరకు వెళ్తే కన్నీళ్లు పెట్టించారని గుర్తు చేశారు.. తాము మాత్రం నల్లగొండలో ఫ్లోరెడ్ రక్కసిని రూపుమాపాం అని కేటీఆర్ తెలిపారు.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కాంగ్రెస్ డబ్బా ఇండ్లు కట్టించి ఇచ్చింరని.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.28 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని, ఒక్క డబుల్ బెడ్ రూం ఇండ్లు ఏడు ఇందిరమ్మ ఇండ్లతో సమానమని పేర్కొన్నారు.. గృహలక్ష్మి పథకం కింద మరింత మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పరిపాలనలో మున్సిపాలిటీలకు డబ్బులు రాకపోయేది అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 2014 -23 మధ్య ఒక లక్షా 21 వేల 294 కోట్లు ఖర్చు చేశాం. 2004 – 14 వరకు చూస్తే ఖర్చు చేసింది రూ. 26,211 కోట్లు. అంటే 462 శాతం ఎక్కువ ఖర్చు చేశాం. కేంద్రం ఒక మిథ్య అని ఎన్టీఆర్ ఏనాడో చెప్పారు. రాష్ట్రాల సమహారమే కేంద్రం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.