తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థ ఆమోదించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ ద్వారా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఇక నుంచి స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయని, ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం.. తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేసిందని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు.
ఈ జోనల్ వ్యవస్థ ఏర్పాటు కోసం సుదీర్ఘ కసరత్తు చేసి, గొప్ప దార్శనికతతో సీఎం కేసీఆర్ వ్యవహరించారని తెలిపారు. జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించి అమల్లోకి తీసుకువచ్చారని చెప్పారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని మించి వివిధ శాఖల ద్వారా 1,33,000పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకి అందించామని కేటీఆర్ తెలిపారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేళ్లలో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేల పరిశ్రమలను తెలంగాణ ఆకర్షించిందని కేటీఆర్ వివరించారు. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కేది వీరికే..!