Wednesday, November 20, 2024

KTR – కాంగ్రెస్‌కు తెలంగాణ‌లో బేస్ లేదు – 57 సీట్ల‌కు మించి ఎన్న‌డూ గెల‌వ‌లేదు

ప్రజలు కోరుకుంటున్నది స్థిరమైన ప్రభుత్వం అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఓ మీడియా నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ప‌లు అంశాల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలి, పెట్టుబడులు రావాలి, శాంతిభద్రతలు బాగుండాలి, విధానపరమైన పనులు వేగవంతంగా జరగాలంటే.. స్థిరమైన ప్రభుత్వం, బలమైన, దృఢచిత్తమైన, నిర్ణయాత్మకంగా వ్యవహరించే నాయకత్వం ఉండాలని చెప్పారు. దేశంలో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో నంబర్‌ వన్‌ స్థానం కేసీఆర్‌ చేతిలో, బీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కేవలం రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతోందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ బేస్‌ లేదని.. ఏ ఒక్క ఎన్నికల్లోనూ 57 సీట్లు మించి రాలేదని స్ప‌ష్టం చేశారు.. మీడియాతో ముచ్చ‌ట ఆయ‌న మాట‌ల్లోనే..

‘దేశంలో పలు రాష్ట్రాల్లో స్ట్రాంగ్‌ రీజినల్‌ లీడర్స్‌ ఉన్న పార్టీలే గెలుస్తున్నాయి. బీజేపీని నిలువరించింది కూడా మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, కేసీఆర్‌, స్టాలిన్‌ తప్ప కాంగ్రెస్‌ వల్ల కాలేదు. అందుకే ప్రజలు కోరుకుంటున్నది స్థిరమైన ప్రభుత్వం. ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారడం కాదు. కర్ణాటకలో చూస్తే.. అప్పుడే కీచులాటలు మొదలయ్యాయి. అక్కడ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యి మూడు, నాలుగు నెలలు అయ్యింది అంతే. అప్పుడే డీకే శివకుమార్‌ వెనుక నుంచి గోతులు తవ్వుతున్నారు. ప్రియాంక ఖర్గే కత్తులు దూస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ప్రజలు చూశారు. కాంగ్రెస్‌ పార్టీ గత 40 ఏళ్లలో తెలంగాణలో ఏ ఒక్క ఎన్నికల్లోనూ 56 – 57 సీట్లు దాటి గెలిచిందిలేదు. వాస్తవానికి కాంగ్రెస్‌కు ఇక్కడ బేస్‌ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌ వచ్చింది రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే (2004- 2009). అప్పుడు కూడా మెజారిటీ సీట్లు రాలేదు. ఇక్కడ కాంగ్రెస్‌కు స్ట్రెంత్‌ లేదు, కేడర్‌ లేదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ మాటే లేదు’ అని చెప్పుకొచ్చారు.

క‌ర్నాట‌క త‌ర్వాత ఉన్న గాలి ఇప్పుడు లేదు..
‘కర్ణాటక ఎన్నిక తర్వాత బీజేపీ అంతో ఇంతో ఎగురతా ఉండిందో.. ఆ గాలి ఒక్కసారిగా దిగింది. అందులోంచి కొంత కాంగ్రెస్‌వైపు మళ్లింది. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అని రెండో స్థానం కోసం బీజేపీ కొట్లాడిందో ఇప్పుడా ప్లేస్‌ను కాంగ్రెస్‌ తీసుకుంది. నంబర్‌ వన్‌ ప్లేస్‌ మాత్రం పదిలంగా కేసీఆర్‌ చేతిలో.. బీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉంది. కర్ణాటకలో మూడేండ్ల కిందటనే అక్కడి ఫలితాలు డిసైడ్‌ అయ్యాయి. ఎందుకంటే 40 శాతం కమీషన్లు అని కాంట్రాక్టర్లే ఆరోపణలు చేయడం.. 40 శాతం కమీషన్‌ అని అక్కడి ప్రైవేటు విద్యా సంస్థలు ఆరోపణలు చేయడం, స్పష్టంగా ప్రధాన మంత్రికి ఉత్తరాలు రాయడం.. మఠాలు కూడా 30 శాతం కమీషన్‌ ఇవ్వకుంటే నిధులు రావట్లేదని నేరుగా ప్రధాన మంత్రికి లేఖలు రాయడం ఇదంతా కూడా జరగడం వల్ల.. కర్ణాటకలో ప్రభళమైన అసంతృప్తి వేళ్లూనుకుంది. అక్కడ నిజంగా కాంగ్రెస్‌ గెలిచిందేం లేదు.

ప్ర‌జ‌ల్లో ఎలాంటి అసంతృప్తి లేదు.. పార్టీల‌కు త‌ప్ప‌..
చేజేతులా బీజేపీ అధికారాన్ని పారేసుకుంది. ఇక్కడ తెలంగాణలో చూస్తే పదేండ్ల తర్వాత కొంత అసంతృప్తి ఉంటుంది. ఏ రూపంలో అంటే కొత్త రేషన్ కార్డులు రాలేదనో.. కొత్త ఫించన్లు రాలేదనో ఉంది. ఇవాళ మా ప్రత్యర్థులు చూస్తే ఎక్కడ కూడా ప్రజల అంశాలు మాట్లాడట్లేదు. తెలంగాణలో ప్రజలకు తాగునీరు రావట్లేదని మాట్లాడే పరిస్థితి లేదు. కేసీఆర్‌ ఆ పని పూర్తి చేశారు. సాగునీరు రావట్లేదని అనే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రాజెక్టులు పూర్తయినయ్‌. ఇబ్బడిముబ్బడిగా పంటలు పండుతున్నయ్‌. మా ప్రత్యర్థులు రోడ్ల మీదకు పోతుంటే ఎక్కడికక్కడ పుట్లకు పుట్లు వడ్లు కనపడుతున్నయ్‌. కరెంట్‌ రావడం లేదు అనడానికి లేదు. అనడానికి మౌళిక అంశాలు లేవు. అందుకే ప్రచారంలో ఏం చెబుతున్నారంటే.. అహంకారం.. దొరలు కావాలా ప్రజలు కావాలా ? మార్పు కావాలి.. అని అంటున్నారు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement