హైదరాబాద్, ఆంధ్రప్రభ: ”పల్లెలకు ఏం కావాలి, ఏ అవసరాలు ఉన్నాయో సీఎంకు బాగా తెలుసు… సర్పంచ్ కంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నేత అయినందునే పల్లెలను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు… పల్లెకు, పల్లె ప్రజలకు ఏం కావాలో కేసీఆర్‌కు తెలిసినంతగా దేశంలో ఏ నాయకుడికీ తెలియదు” అని రాష్ట్ర, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్ఐఆర్డీలో శిక్షణకు హాజరయ్యా రని, రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఏం విధులు నిర్వహిం చాలో అధ్యయనం చేశారని వివరించారు. గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయకపోతే అభివృద్ధి జరగలేదని తేల్చి చెప్పారు. గ్రామాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో సమీకృత, సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందని వివరించారు. ప్రధాని మోడీకి ఇష్టం లేకపోయినా రాష్ట్రానికి అవార్డులు ఇవ్వాల్సి వస్తోందని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులను రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డిలతో కలిసి కేటీఆర్ అందజేశారు. తొమ్మిది కేటగిరీల్లో 50 అవార్డులను రాష్ట్రంలోని 47 గ్రామ పంచాయతీలకు ప్రదానం చేశారు. అంతకు ముందు పల్లె కళకారులతో కలసి డంపు వాయించి సందడి చేశారు కెటిఆర్.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణలో జరుగుతున్నన్ని అభివృద్ధి పనులు మీరు పాలించే ఏ ఇతర రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా అని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సర్పంచ్‌లు చేసిన పనులకు సంబంధించి రూ.1300 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబందించిన అధికారులు రాష్ట్రంలోని పనిచేస్తున్నారని, తెలంగాణలో గ్రామాలు ఎలా ఉన్నాయి..?; వారి సొంత రాష్ట్రాల్లోని గ్రామాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవాలని సూచించారు. మాటలు మాట్లాడగానే సరిపోదని, ప్రజల వద్దకు పాలనను తీసుకుపోవాలనే సంకల్పం ఉండాలన్నారు. శత్రుదేశంపై పగబట్టినట్లు కేంద్రం తెలంగాణపై ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానంలో, అవినీతిలో అట్టడుగు స్థానంలో ఉందని వివిధ సర్వేలు చెబుతున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు.
ప్రస్తుతం తొలిసారి గెలిచిన ప్రజాప్రతినిధులకు తమ విధులపై పూర్తి అవగాహన ఉండడం లేదన్నారు. మన దేశంలో ప్రభుత్వ వ్యవస్థ ఐదు అంచెలుగా ఉందని, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయకపోతే అభివృద్ధి జరగదన్నారు. ఎంపీటీసీలు గ్రామాలకు మండలానికి మధ్య సమన్వయకర్తగా ఉండాలని, జడ్పీటీసీలు మండలానికి, జిల్లా పరిషత్‌కు మధ్య సమన్వయకర్తగా ఉండాలని, ఐదంచెల వ్యవస్థలో ఎవరి పాత్ర ఏంటో తెలుసుకోనంత కాలం ప్రజాప్రతినిధులైనా, వ్యవస్థ అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవాలనే ఆరాటంతో అనేక హామీలు ఇచ్చి మరిచిపోతున్నారని, అయితే ఆహామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీ అయితే తక్షణమే భర్తీ చేయాలని కలెక్టర్లకు ప్రభత్వం ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుతోనే వికేంద్రీకరణ ఆగలేదని, అంతటితో ఆగకుండా 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు ఉన్నాయని, 12769 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. దీంతో సూక్ష్మంగా పనిచేసేందుకు వీలు కలిగిందన్నారు. వికేంద్రీకరణ వల్ల పనులు వేగంగా జరుగుతాయని, ఇప్పటి వరకు 79 జాతీయ అవార్డులను తెలంగాణ పల్లెలు గెలుచుకున్నాయని చెప్పారు.