Friday, November 22, 2024

అటు అమ్మ కోరికను, ఇటు నాన్న కోరికను తీర్చలేకపోయా – కేటీఆర్

సిరిసిల్ల – అటు అమ్మ కోరికను, ఇటు నాన్న కోరికను తీర్చలేకపోయానని చివరికి రాజకీయ నాయకుడినయ్యానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో ఏటా 10వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.

దేశ వైద్యవిద్య రంగంలో తెలంగాణ వేదికగా సరికొత్త రికార్డు న‌మోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, వికారాబాద్‌, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల త‌ర‌గ‌తుల‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు

.రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి కె టి ఆర్ ప్రసంగిస్తూ, ‘ నేను కూడా బైపీసీ విద్యార్థినే. మా నాన్న నన్ను ఐఏఎస్‌ చేయాలని అనుకునేవారు. మా అమ్మకు నన్ను డాక్టర్‌ చేయాలన్న కోరిక ఉండేది. ఎంసెట్‌లో 1600 ర్యాంక్‌ సాధించినా ఎంబీబీఎస్‌ సీటు రాలేదు.ఇప్పుడు అటు ఇటు కాకుండా రాజకీయ నాయకుడినయ్యాను. నేను 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు కొసం గొడవ జరిగింది. డిగ్రీ కాలేజీ సిరిసిల్ల ,వేములవాడలో పెట్టాలని గొడవ జరిగి అటుఇటు కాకుండా మధ్యలో పెట్టారు. అలాంటిది నేడు సిరిసిల్లకు జేఎన్‌టీయూ, మెడికల్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ వచ్చాయి. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది. పేదలకు సేవ చేసేందుకు మంచి శిక్షణ పొందండి. ఆపదలో వచ్చే వాళ్లు అటు దేవుణ్ణి ఇటు వైద్యులైన మిమ్మల్నే వేడుకుంటారు.” అంటూ వైద్య విద్యార్థులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement