హైదరాబాద్, ఆంధ్రప్రభ : నాలుగు రోజుల పాటు లండన్‌లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆదివారం లండన్ నుంచి దావోస్ బయలుదేరారు. లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్ రాజధాని నగరం జ్యురిచ్ చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరుకుంటారు. సోమవారం నుంచి జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పలు ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మూడురోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ సమావేశాల్లో ప్రధాన సమావేశమందిరంలో జరిగే పలు చర్చల్లో పాల్గొంటారు.
తర్వాత 26వ తేదీన స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ నగరంలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. లండన్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలకు బయల్దేరిన మంత్రి బృందానికి లండన్‌లోని టీఆర్‌ఎస్ ఎన్‌ర్‌ఐ శాఖ కార్యకర్తలు పెద్ద ఎత్తున వీడ్కోలు పలికారు. దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో కేటీఆర్ వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ కూడా పాల్గొననున్నారు.