Saturday, November 23, 2024

బ‌రాబ‌ర్ మాది కుటుంబ పాల‌నే – తెలంగాణ ప్ర‌జ‌లే మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ః కెటిఆర్

హైద‌రాబాద్ – తెలంగాణాలో బ‌రాబర్ మాది కుటుంబ పాల‌నే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కెసిఆర్ కుటుంబ పెద్ద అంటూ మంత్రి కెటిఆర్ నిండు అసెంబ్లీలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు..రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందన్న ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. తమది ముమ్మాటికీ కుటుంబపాలనే అన్నారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబసభ్యులేనన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి పెద్ద అని చెప్పారు. అందుకే కుటుంబపాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తున్నామ‌ని స‌భామ‌ఖంగా కెటిఆర్ ప్ర‌క‌టించారు.

శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగం సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారో చెప్పాలన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడని, కానీ బీజేపీలోకి వెళ్లాక ఆయనలో మార్పు వచ్చిందని అన్నారు. కమలం పార్టీలోకి వెళ్లాక మనుషులు మారిపోతారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ రాక ముందు కరెంట్ ఎలా ఉండేదో వచ్చాక ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసన్నారు. అప్పట్లో పవర్ హాలిడేస్ ఉంటే.. ఇప్పుడు పవర్ ఫుల్ డేస్ అని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబంలోని అవ్వ తాతకు పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకులా ఆసరా అయితున్నార‌ని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 4కోట్ల మందిని తోబుట్టువుగా చూసుకుంటున్నార‌ని అన్నారు. కంటి వెలుగుతో వృద్ధులకు కంటి చూపు, గురుకులాలు, కాలేజీలతో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న కేసీఆర్.. ఒంటరి మహిళలకు ఫించన్ ఇస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నార‌ని చెప్పారు. 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించి కేసీఆర్ మేనమామలా అండగా నిలిచాడని అన్నారు. ఇన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ, తెలంగాణ ప్ర‌జ‌లకు పెద్ద‌గా కెసిఆర్ ఉన్నార‌ని అన్నారు.. విద్యుత్ మోట‌ర్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై అసెంబ్లీలో కెటిఆర్ నిప్పులు చెరిగారు.. 27 ఏళ్లుగా బిజెపి పాల‌న‌లో ఉన్న గుజ‌రాత్ లో ప‌వ‌ర్ హాలిడే లు ప్ర‌క‌టిస్తున్నార‌ని,రైతుల‌కు ఒక్క యూనిట్ కూడా ఉచితంగా విద్యుత్ అక్క‌డ ఇవ్వ‌డం లేదంటూ గ‌ణాంకాల‌తో వివ‌రించారు..
ఇదేనా 27 పాల‌న‌లో గుజ‌రాత్ లో సాధించిన ప్ర‌గ‌తి అంటూ నేరుగా ప్ర‌ధాని మోడీని నిల‌దీశారు. 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్, రైతుల‌కు ఉచిత ప‌వ‌ర్ అందిస్తున్న ఏకైక తెలంగాణ‌ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు ఎందుకు పెట్టాలని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. మోటార్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసిందని అయితే మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశామని చెప్పారు. కేసీఆర్ ఉన్నంతకాలం రాష్ట్రంలో కేంద్రం పప్పులుడకవన్నారు. విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్న కేటీఆర్ గుజరాత్లో విద్యుత్, నీటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ అన్నట్లుగా గుజరాత్లో పాలన ఉందని విమర్శించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ తోనూ, మిష‌న్ కాక‌తీయ‌తోను స‌మృద్ధిగా నీటి నిల్వ‌లు పెంచ‌డంతో తెలంగాణాలో ల‌క్ష‌ల ఏక‌రాలలో పంట‌లు పండుతున్నాయ‌ని అన్నారు..67 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు ఉన్న వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు ఇప్పుడు రెండు కోట్ల మెట్రిక్ ట‌న్నులు పెరిగాయని వెల్ల‌డించారు..ఇంత అభివృద్ది,ప్ర‌గ‌తి జ‌ర‌గుతున్న మోడీ మాత్రం తెలంగాణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడ‌ర‌ని అన్నారు.. కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఇవ్వ‌ర‌ని,అయితే నీటి కేటాయింపులే లేని అప్ప‌ర్ భ‌ద్ర‌కు మాత్రం జాతీయ హోదా ఇచ్చేశార‌ని మోడిని దెప్పి పొడిచారు.. జాతీయ‌,అంత‌ర్జాతీయ సంస్థ‌లు కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్ర‌శంస‌లతో ముంచేత్తుతుంటే , మ‌న మోడీ త‌న మ‌న్ కీ బాత్ కూడా కాళేశ్వ‌రం గురించి ప్ర‌స్తావించ‌ర‌ని పేర్కొన్నారు.. కేంద్రం స‌హ‌క‌రించిన‌ట్ల‌యితే మ‌రిన్నిప‌థ‌కాల‌తో ప్రజ‌ల‌కు మేలు చేసే ప‌నులు చేప‌ట్టే వార‌మ‌ని,అయితే కేంద్ర వివ‌క్ష కార‌ణంగా ముందుకు వెళ్ల‌లేక‌పోతున్నామ‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement