హైదరాబాద్ – చేవెళ్లలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డియర్ అమిత్ షా జీ..త్వరలో అధికారంలోకి కాదు. బీజేపీ అంధకారంలోకే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాదు త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ అవుతుందని ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ ఖాయమని జోస్యం చెప్పారు. 2024 లో వైఫల్యాల మోడీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదని హెచ్చరించారు. మరోసారి మోడీని ప్రధాని పీఠం ఎక్కిస్తే..దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే అనే బలమైన భావనలో ప్రజలు ఉన్నారు. కారు స్టీరింగ్ కాదు..బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కింది. కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం విలవిలలాడుతోందన్నారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో బీజేపీ ఫుల్ పిక్చర్ ను దేశ ప్రజలు 70 ఎంఎంలో చూసేశారు. ఇంకా ఏ ట్రయిలర్ అవసరం లేదని చమత్కరించారు.
తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవు. ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవు. అదానీపై జేపీసీ వేయని బీజేపీకి..సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా..? అని ప్రశ్నించారు. ముక్కు నేలకు రాసినా, మోకాళ్ల యాత్ర చేసినా, మోసాల మోడీని తెలంగాణ నమ్మదు. బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదని తనదైన శైలిలో మంత్రి సెటైర్లు వేశారు. కరప్షన్ కు కెప్టెన్ మోడీ క్యాప్షన్ బీజేపీ అని ఎద్దేవా చేశారు. ఎంఐఎం భుజంపై తుప్పుపట్టిన బీజేపీ తుపాకీ పెట్టి ఎంతకాలం కాలుస్తారని అన్నారు. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వని బీజేపికి మిగిలేది బూడిదే అని జోస్యం చెప్పారు.