సిరిసిల్ల, మార్చి 7 (ప్రభన్యూస్) : సిరిసిల్లకు ప్రమాదం పొంచి ఉన్నదని, మళ్లీ ఉరిసిల్లగా మారే ప్రమాదం ఉన్నదని బీఅర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. గురువారం రాత్రి పొద్దు పోయాక పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సిరిసిల్లలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించారు. స్థానిక తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో సిరిసిల్ల పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో రూ.200 కోట్ల బతుకమ్మ చీరల బకాయలు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరానని, ఆయన పర్యటన రద్దు అయినప్పటికీ మరో వారం, పది రోజుల్లో పెద్ద ఎత్తున నేతన్నల కోసం మహా ధర్నా కార్యక్రమం చేపడతామని కేటీఆర్ వెల్లడించారు.
కార్మికులను యజమానులుగా చేసే వర్కర్ టు ఓనర్ పథకమును రూ.400 కోట్లతో చేపట్టి తమ ప్రభుత్వం వర్క్ షెడ్లను నిర్మించిందని అయితే వర్కర్ టు ఓనర్ పథకం కింద కార్మికులకు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద కుట్రకు పూనుకున్నదని వెల్లడించారు. వీటిని అడ్డగోలు ధరకు ఇతర ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి పూనుకున్నదని, దీనిపై తమకు ఖచ్చితమైన సమాచారం ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు.
తనపై కోపం ఉంటే నేతన్నలపై కోపం తీసుకోవద్దని, ఈ పద్ధతి మార్చుకోవాలని సీఎంకు కేటీఆర్ హితవు పలికారు. కరీంనగర్ ఎంపీగా పని చేసిన బండి సంజయ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఆయన పనికిరాని ఎంపీ అని ప్రజలకు అర్థం అయిందని పేర్కొన్నాడు. బండి సంజయ్ పై భ్రమలు తొలిగాయని, ఆయన ఎంపీగా ఉండడం అధర్మం అని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గా వినోద్ కుమార్ ఐదేళ్లు పనిచేస్తే, బీజెపి పార్టీ ఎంపీ బండి సంజయ్ మరో ఐదేళ్లు పనిచేశాడని, కనీసం ఒక బడి గాని, ఒక గుడి కానీ ఆయన నియోజకవర్గంలో కట్టలేదన్నారు. వీరిద్దరూ చేసిన అభివృద్ధి పనులపై చర్చ జరగాలన్నారు. బండి సంజయ్ కి చిత్తశుద్ధి ఉంటే తేదీ, సమయం చెప్పాలని, తమ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఈ చర్చకు హాజరు అవుతారని తెలిపారు. ఈ చర్చలో ఎవరు యోగ్యులో ప్రజలు తీర్పు ఇస్తారని, ఎవరు ఏం చేశారో తేలుతుందన్నారు.
సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమల సంక్షోభం కొనసాగుతుంటే నేతన్నలకు ఆగిపోయిన బతుకమ్మ చీరల ఆర్డర్లపై ఒక్కనాడు అయిన బండి సంజయ్ మాట్లాడలేదన్నారు. కనీసం మెగా క్లస్టర్ గురించి మాట్లాడలేదని, ఏ రోజైనా సిరిసిల్లకు మెగా క్లస్టర్ రావాలని మాట్లాడినాడా అని ప్రశ్నించారు. కేవలం దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నట్టు చెబుతున్న బండి సంజయ్ 5 ఏళ్లలో ఏ పని చేయలేదని, మాట మాటకు జైశ్రీరామ్ జపం చేయడం ఆయన డ్యూటీ అన్నారు.
5 ఏళ్లలో సిరిసిల్ల నేతన్నలకు కానీ మున్నూరు కాపులకు కానీ సాయం చేయలేదని, ఎంపీ హోదాలో ఎన్నడు అభివృద్ధిపై సమీక్షలు పెట్టలేదన్నాడు. ఎన్నికల సమయంలో ఫ్లెక్సీలలో పైన రాముడు కింద బండి సంజయ్ ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నాడని, మతం అడ్డం పెట్టుకొని, కులమతాలతో రాజకీయం చేస్తున్నాడని అన్నారు.
కేసీఆర్ అద్భుతమైన యాదాద్రి దేవాలయం నిర్మిస్తే ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టుకోలేదన్నారు. పంటలు ఎండిపోతున్నాయని, రోజుకు 5000 క్యూసెక్కుల నీరు కాలేశ్వరం నుండి సముద్రం పాలు అవుతున్నదన్నారు. ఎలా చేయాలో రేవంత్ రెడ్డికి తెలివి లేదని, కేసీఆర్ ఉంటే కాపర్ డ్యాం నిర్మించి నీటిని ఉపయోగంలోకి తెచ్చేవాడని, కరువును శాశ్వతంగా పారదోలేవాడన్నారు. కరువును శాశ్వతంగా నివారించే బ్రహ్మాస్త్రం కాలేశ్వరం ప్రాజెక్టుగా అభివర్ణించాడు. కాంగ్రెస్ చేపట్టిన మంచి పనులు అన్నింటిని కొనసాగించామని, వైయస్ తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కొనసాగించామన్నారు. కానీ కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నాడని, తెలంగాణ లేకుండా చేస్తేనే కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం సాధ్యమవుతుందని కేటీఆర్ పేర్కొన్నాడు.
యోగ్యుడైన వినోద్ కుమార్ ను ఈసారి మళ్లీ పార్లమెంటుకు పంపాలని, నా ధైర్యం మీరేనని, భవిష్యత్తు మనది ఉజ్వల భవిష్యత్తు వస్తుందని, మళ్లీ పార్లమెంటుకు 100 స్పీడుతో వెళ్తామన్నారు. వచ్చే 45 రోజుల పాటు అత్యంత కీలకమని, పార్లమెంటులో మనమే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కార్యకర్తలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులు ఇతర ప్రాంతాల గురించి ఆలోచించకుండా తన వార్డు తన ప్రాంతం గురించి ఆలోచించాలని కార్యకర్తలకు కేటీఅర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్, సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ తదితర నాయకులు పాల్గొన్నారు..
ఖమ్మం, నల్లగొండ మానవ బాంబులు నీ చుట్టే ఉన్నాయి – జాగ్రత్త
సీఎం రేవంత్ రెడ్డి దిగజారీ మాట్లాడుతున్నారని, పాలమూరు సభలో ఆయన గొంతుకోస్తా, మానవ బాంబై పేలుతా అన్న వ్యాఖ్యలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే మానవ బాంబులున్నారని .. కొందరు ఖమ్మం నుంచి ఉంటే, మరికొందరు నల్లగొండ నుంచి మానవ బాంబులున్నారంటూ ఎద్దేవా చేశారు.
అంతే కాకుండా .. ప్రజలకు గుర్రం ఎవరో .. గాడిద ఎవరో తెలిసి రావాలని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీలు నెరవేర్చే వరకు ఆయనను వదిలే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఆంధ్ర పాలకులు, కరుడు గట్టిన కాంగ్రెస్ నేతలతో పోరాటీ తెలంగాణను సాధించుకున్నామని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిగజారీ మాట్లాడుతున్నాడని, అధికారంలో ఉన్న కూడా ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నరని పేర్కొన్నారు.
రేవంత్ ను ఖమ్మం, నల్గొండ బాంబులే ఏమైన చేయోచ్చన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లపాటు పాలన కోనసాగించాలని తాము కోరుకుంటున్నామని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడు కదా.. ప్రజలకు ఎవరు ఎలా పాలించారో అర్థమౌతుందన్నారు.
కేసీఆర్ ను కావాలని బద్నామ్ చేయాలని ప్రతిదానిపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దెవా చేశారు. పదేళ్లు ప్రధాని మోదీగా ఉన్నారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి కూడా కరీంనగర్ కు ఏంచేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వచ్చే ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.
అంతకుముందు కరీంనగర్ జిల్లా ఇరుకుళ్ళ గ్రామంలో సాగు నీరందక ఎండిన వరి పంట పొలాలను పరిశీలించారు కేటీఆర్. రైతులను అడిగి సమస్య లను తెలుసుకున్నారు.