ఆడబిడ్డలకు సాయం అటకెక్కిందా!
అప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేకత
50 రోజుల్లోనే జనాల్లో అసంతృప్తి
మహిళల మధ్య కొట్లాటలు
ఆటోలు తగలెడుతున్న డ్రైవర్లు
420 హామీలపై స్పందించని కాంగ్రెస్
మూడు అడుగులు లేని వ్యక్తి అంటూ సీరియస్
కేసీఆర్పై వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్
మేడ్చల్ అసెంబ్లీ నేతలతో సమీక్ష
ఆడోళ్ల మధ్య పోట్లాటలు.. డ్రైవర్ల అకలి కేకలు.. రుణ మాపీకి చెల్లు చీటి.. అటకెక్కిన ఆడబిడ్డల సాయం పథకం.. ఇదే 50 రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన ప్రగతి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో శుక్రవారం ఘట్ కేసర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందన్నారు. డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారని, రెండు నెలలు గడుస్తున్నా రైతుల రుణమాఫీ జరగలేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఉచిత బస్సుల వల్ల పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలిసిందే అన్నారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు. సీట్లు దొరక్క ఆడ బిడ్డలు, ఎక్క లేక మగవాళ్లు ఆగం అవుతున్నారని కెటీఆర్ ధ్వజమెత్తారు.
కడుపుమండి ఆటోలను తగలేస్తున్నరు..
హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ చేతులెత్తేశారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్లు కడుపుమండి ఆటోలు తగల బెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. కృష్ణా జలాల్లో మా వాటా ఎంత అంటే తేల్చలేదన్నారు. మన వాటా తేల్చకుండానే కేఆర్ఎంబీకి అంతా అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రయోజనాలను కాంగ్రెస్ కేంద్రానికి తాకట్టు పెట్టిందన్నారు. అందుకే జాతీయ పార్టీలను నిలదీయాలంటే బీఆర్ఎస్ ఉండాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలన్నారు. కేంద్రంలోని బీజేపీకి చెక్ పెట్టాలన్నారు.
మూడు అడుగులు లేని వ్యక్తి..
బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ను వంద అడుగుల లోతులో బొందపెడతామన్న రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మూడు అడుగులు లేని రేవంత్ తెలంగాణ విధాత కేసీఆర్ను ఎలా బొంద పెడతారని ప్రశ్నించారు. ఈ బుడే ఖాన్ మాటలు, ఊక దంపుడు ఉపన్యాసాలు ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించడం మాని ఇచ్చిన వాగ్దానాల అమలుపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర రేవంత్ దే నని అన్నారు.