Monday, November 18, 2024

సీనియ‌ర్ సిటిజ‌న్స్ తో కేటీఆర్ క్యార‌మ్స్.. వృద్ధాశ్ర‌మంలో సంద‌డి

సిరిసిల్ల : రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. రూ.40 లక్షలతో 25 బెడ్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రంలో సదుపాయాలను కలెక్టర్ అనురాగ్ జయంతిని అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వృద్ధుల సంరక్షణ కేంద్రం చాలా బాగుంది…. సౌలతలు చాలా చాలా బాగున్నాయన్నారు. వయో వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వృద్ధుల సంరక్షణ కేంద్రంను అన్ని సౌలత్ లతో వయోవృద్ధులకు ఉపయోగకరంగా ఉండేలా తీర్చిదిద్దిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ని మంత్రి కే తారక రామారావు అభినందించారు. సంరక్షణ కేంద్రంలోని వృద్ధులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ వస్తుందా అంటూ అడిగారు. కాసేపు వృద్ధులతో కలిసి టేబుల్ టెన్నిస్ తో పాటు క్యారం బోర్డును ఆడారు. తనతో క్యారం ఆడుతున్న సమయంలో గమనించిన లోపాలను ఎత్తిచూపుతూ ఎలా క్యారం ఆడాలో సూచనలు చేశారు. మలిసంధ్యలో ఆదరణకు నోచుకోలేక నిలువనీడ కరువవుతున్న వృద్ధులకు చివరి దశలో ఆత్మ గౌరవంతో బ్రతికేందుకు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

మండల కేంద్రంలోని ఎస్టీ వసతి గృహాన్ని రూ.40 లక్షల నిధులతో మరమ్మతులు చేసి సంరక్షణ కేంద్రంను ఏర్పాటు చేశారు. అన్ని పడకలకూ దోమతెరలు పుస్తక పఠనాభిలాషుల కోసం గ్రంథాలయం, మానసికోల్లాసానికి యోగా, ఆటగది వంటివాటిని ఆధునిక వసతులతో కాలక్షేపానికి టీవీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు .అలాగే వార్తా పత్రికలు అందుబాటులో ఉంచడంతో పాటు చెస్‌, వైకుంఠపాళి, క్యారం బోర్డు లాంటి ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. కూర్చుని మాట్లాడుకునేందుకు ఒక వేదికను నిర్మించామన్నారు. వ్యాయామం చేసేందుకు అవసరమైన సాధనాలు, ఫిజియో థెరఫీ పరికరాలను అందులో అందుబాటులో ఉంచారు. భవనం ఆవరణలో రంగు రంగుల పూల మొక్కలు ఉదయం, సాయంత్రం నడిచేందుకు వీలుగా కేంద్రం ఆవరణను పార్కులా తీర్చిదిద్దారు. భవనం గోడలపై రంగు రంగుల చిత్రాలను వేయించామన్నారు. మరోవైపు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యుడిని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ వృద్ధులకు..వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement