అన్నదాతల ఆక్రందనలపై పోస్ట్ లు
పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
దీనిపై కెటిఆర్ ఆగ్రహం
తాను కూడా రైతుల అన్యాయంపై మాట్లాడా
మరి నాపై కూడా కేసు నమోదు చేస్తారా
రాష్ట్ర డిజిపిని నిలదీసిన కెటిఆర్
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా సాగునీరు లేక.. 24 గంటల కరెంట్ అందక.. చివరకు రైతుబంధు రాక.. రైతన్నలు విలవిలలాడిపోతున్నారు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్‌కు ఓటేసి మోసపోయామని కన్నీళ్లు పెడుతున్నారు. మళ్లీ కేసీఆరే రావాలని వేడుకుంటున్నారు అన్నదాతలు. అన్నదాతల దయనీయ పరిస్థితులను ప్రపంచానికి తెలియజేస్తున్న యూట్యూబ్ చానెల్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. నల్లగొండ జిల్లాలోని ముషంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు కాంగ్రెస్ పార్టీని అనవసరంగా గెలిపించామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో సాగునీరు వచ్చింది. 24 గంటల నాణ్యమైన కరెంట్ అందింది. ఏడాదికి రెండుసార్లు రైతుబంధు జమ చేసి అప్పుల పాలు కాకుండా చేశారు. కానీ రేవంత్ పాలనలో రైతుబంధు రాక అప్పులపాలవుతున్నామని, మళ్లీ కేసీఆరే రావాలి.. నాతో పాటు మరో పది మందితో కేసీఆర్‌కు ఓట్లు వేయిస్తామని రైతు మల్లయ్య ఆవేదనతో మాట్లాడారు. రైతు మల్లయ్య మాట్లాడిన వీడియోను జర్నలిస్టు గౌతమ్ గౌడ్ యూట్యూబ్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పాలనతో అన్నదాతల పరిస్థితి ఇది అని వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ మల్లయ్య వీడియోపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టు గౌతమ్ గౌడ్ కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అసలు ఈ వీడియోలో తప్పేముంది..? జర్నలిస్టు గౌతమ్ గౌడ్‌పై కేసు ఎందుకు నమోదు చేశారు..? అని తెలంగాణ డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు. నేను కూడా ముషంపల్లిలో రైతు మల్లయ్యను కలిశాను. అతనితో మాట్లాడాను. మరి నాపై కేసు పెడుతారా..? అని డీజీపీని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.