హైదరాబాద్ : రూ. 71 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో స్వచ్ఛ బడిని ప్రవేశపెడుతున్నాం అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా హైదరాబాద్ శిల్పాకళావేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి వేడుకలకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై ప్రసంగిస్తూ, స్వచ్ఛ బడి ద్వారా తడి, పొడి, హానికర చెత్త వేరుచేసే విధానం, కంపోస్టు ఎరువు తయారీ చేసే విధానంపై యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ తెలిపారు. టీఎస్ఐపాస్ తరహాలో టీఎస్ బీపాస్‌ను తీసుకొచ్చాం. స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణానికి అవకాశం ఇచ్చాం. 9 ఏండ్లలోనే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి సాధించాం. దేశంలోనే ఇవాళ బెంగళూరును పక్కన పెట్టేసి.. ఐటీ రంగంలో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయి. ఏక కాలంలో పల్లె ప్రగతి, పట్టణాల ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి సాధించాయని కేటీఆర్ తెలిపారు