అప్పుడేమో ములాఖత్ లు…ఇప్పుడేమో అరెస్ట్ లు
మీ పాలనలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా
భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన మీరు
నిరుద్యోగులకు ఇచ్చే బహుమతి ఇదేనా
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ
నిరుద్యోగులపై దాడులు హేయం
ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్ : నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ డొల్ల వైఖరిని, అవకాశవాదాన్ని ఎండగడుతూ ఉద్యోగాల సాధన కోసం డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల ద్వారా అణిచివేత కార్యక్రమాలని చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేసిన యువకులు నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. ఉద్యోగాల భర్తీ, గ్రూప్స్ నోటిఫికేషన్లలోని సమస్యలు, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపైన టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి, ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
అప్పుడేమో ములాఖత్ లు …ఇప్పుడేమో అరెస్ట్ లా..
ఎన్నికల ముందు ఇదే నిరుద్యోగులతో స్వయంగా తమ పార్టీ నాయకులు రాహుల్ గాంధీతో ములాఖత్‌లు ఏర్పాటు చేయించి, అనేక నిరసన కార్యక్రమాలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలోకి రాగానే వారిని అణచివేసే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. కేవలం ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు నిరుద్యోగులను వాడుకొని ఈరోజు వారు డిమాండ్ చేస్తున్న న్యాయమైన అంశాలపైన కూడా నోరు మెదపడం లేదన్నారు.
మీ పాలనలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా..
ప్రజా పాలన పేరును పదేపదే వల్లే వేసే కాంగ్రెస్ సర్కార్ జమానాలో యువకులకు, విద్యార్థులకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పిన జాబ్ క్యాలెండర్ తేదీల గడువు అయిపోయిందని, వెంటనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు చేస్తున్న అన్ని నిరసన కార్యక్రమాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈరోజు అరెస్టు చేసిన విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇది హేయమైన చర్య – హరీశ్ రావు…
హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు . ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా అని నిలదీశారు.
ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగుల గొంతులను, హక్కులను రేవంత్ రెడ్డి సర్కార్ అణగ దొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదని, అప్రజాస్వామ్య పాలన అని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు పరిష్కరించే దాకా, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టేది లేదని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతామని స్పష్టం చేశారు. నిర్విరామ పోరాటం చేస్తామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు.
రాష్ట్రంలో అప్రకటిన ఎమర్జెన్సీ – నిరంజన్ రెడ్డి ..
కాంగ్రెస్ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రగతి భవన్ కంచెలు బద్దలుకొట్టామని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు హైదరాబాద్ నగరమంతా కంచెలు పాతుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిరుద్యోగులు శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావానికి లోనవుతున్నదని చెప్పారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను రెచ్చగొట్టి వాడుకున్నారని విమర్శించారు. అధికారం చేతికి చిక్కాక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రకటించిన పోస్టులకు అదనంగా ఒక్క పోస్టూ పెంచలేదన్నారు.