- రేవంత్, కేటీఆర్ ఒక్కటేనని కేంద్రమంత్రి బండి కామెంట్
- డైవర్షన్ పాలిటిక్స్ లో కేటీఆర్ దిట్ట
- బీఆర్ఎస్ లో హరీశ్ ఒక్కడే క్రెడిబిలిటీ ఉన్న లీడర్
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ యాక్టివ్ సీఎం అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇరు పార్టీలు రోజుకో అంశాన్ని ప్రస్తావించి మళ్లీ దాని ఊసెత్తడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇవాళ చిట్ ఛాట్ గా మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రేవంత్, తాను కొట్లాడామని, అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నామన్నారు.
కేటీఆర్ వి డైవర్షన్ పాలిటిక్స్ …
డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్‌కే ఉందని విమర్శించారు. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల్లో హంగామా చేసిన కేటీఆర్ ఆ తర్వాత రేవంత్ తో కుమ్మకై వాటి విషయం మరిచిపోయారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్‌లో తప్ప ఎక్కడా కనిపించరని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు కళ్లు నెత్తికెక్కాయని అంటూ బీఆర్‌ఎస్‌లో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ హరీశ్‌రావు మాత్రమే అని బండి సంజయ్ అన్నారు.
అక్కడ కాదు.. హైదరాబాద్ లో పాదయాత్ర చేయ్..
ఎక్కడో భువనగిరిలో కాకుండా మూసీ పక్కన ఇల్లు కూలగొట్టే దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీని అణగదొక్కాలని ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మాటలు జనం నమ్మరని తేల్చేశారు బండి.