Sunday, September 22, 2024

Challange Accepted – డేట్, టైమ్ ఫిక్స్ చేయండి – పొగులేటికి కేటీఆర్

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:అమృత్‌ టెండర్లలో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. వెంటనే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి పొంగులేటి సవాల్‌ను స్వీకరిస్తున్నానని చెప్పారు.

హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. స‌వాల్ స్వీక‌రిస్తున్నా.. ‘‘నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం.. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పులు ఎం జరగలేదు అంటే.. నేనే రాజకీయ సన్యాసం చేస్తా. హైకోర్టు సీజే దగ్గరికి రావ‌డానికి ఆ మంత్రికి ఇబ్బంది ఉంది అంటే డేట్, టైం ఫిక్స్ చేయండి.. ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదాం” అని కేటీఆర్ తేల్చి చెప్పారు.

- Advertisement -

మంత్రికి, ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నానని, ఇప్పటికైనా ఆ టెండర్లు రద్దు చేయాలని అన్నారు.

బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణికి లాభాలు..

బీఆర్‌ఎస్‌ పాలనలో సింగరేణి అద్భుత ప్రగతి సాధించిందని కేటీఆర్‌ అన్నారు. పదేండ్లలో సింగరేణి లాభాలు గణనీయంగా పెరిగాయన్నారు. లాభాల్లో కార్మికుల వాటా పెంచుకుంటూ వచ్చామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పది పైసల వాటా మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ పాలన ఉన్న ఐదేండ్లలో 10 పైసల వాటా మాత్రమే ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో 11 పైసల నుంచి 20 పైసల వరకు మాత్రమే ఇచ్చారన్నారు. 1999 నుంచి 2014 వరకు కేవలం రూ.376 కోట్లు మాత్రమే సింగరేణి కార్మకులకు ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలనతో లాభాలు ఎన్నడూ ₹400 కోట్లు దాటలేదు. లాభాలను వెయ్యి కోట్లు దాటించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే. తొమ్మిదిన్నరేండ్లలో తాము ₹2,780 కోట్లు ఇచ్చామని చెప్పారు

కార్మికులకు సీఎం రేవంత్ మోసం..

2022-23లో సింగరేణి లాభాల్లో కార్మికులకు 32 శాతం వాటా ఇచ్చాం. సగటున ఒక్కో కార్మికుడికి ₹లక్షా 60వేలు చెల్లించాం. సింగరేణిని, కార్మికులను ముఖ్యమంత్రి వెన్నుపోటు పోడుస్తున్నడు. కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ దోచుకుంటున్నది. 33 శాతం వాటా ఇస్తున్నామని సీఎం తప్పుడు ప్రకటనలు చేస్తున్నడు. సింగరేణి లాభాలు ₹4701 కోట్లు అయితే 33 శాతం వాటా ఇచ్చామంటున్నారు. కార్మికులకు ₹1551 కోట్లు బోనస్‌ ఇవ్వాలి. ఒక్కో కార్మికుడికి ₹3.70 లక్షలు రావాలి. కానీ ₹లక్షా 90 వేలు మాత్రమే ఇస్తున్నరు. 16 శాతం మాత్రమే ఇస్తున్నామని కాంగ్రెస్‌ ఒప్పుకోవాలి. వాటా విషయంలో మోసం చేయొద్దు..సింగరేణి కార్మికులను మోసం చేయకండి. స్పష్టంగా చెప్పండి’ అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

అనుబంధ సంఘాన్ని గెలిపించినందుకు మీరిచ్చేది ఇదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కుట్రపూరిత వైఖరిపై సీపీఐ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు పోరాడకపోతే సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారన్నారు. ఈ కుట్రను కార్మికులు గుర్తించాలన్నారు. తాము చెప్పినదాంట్లో తప్పుంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement