Saturday, November 23, 2024

కృష్ణ కృష్ణా.. ఏళ్ళు గడిచినా ఎడతెగని జల వివాదం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : సరిగ్గా ఎన్నికల సమయం.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ మొదలైంది. కృష్ణా నదీ జలాలే కేంద్రంగా ఈ వివాదం రాజుకుంటోంది. వాటాల్లో స్పష్టత లేక ప్రతియేటా ఇదే సమస్య పునరావృతమవుతోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ జగిరిన ఏడాది 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రాల మధ్య సయోద్య ఏనాడూ కుదరలేదు. నాగార్జున సాగర్‌ నీటి కేటాయింపుల్లో ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రతియేటా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. చట్టాలు, తీర్పులు, ఒప్పందాలన్నీ ఉల్లంఘనకు గురవుతున్నది ఏపీలోనేనని, వివాదాలు పరిష్కారం కాకుండా నీటి వినియోగం ఎలా చేస్తారని ప్రశ్నిస్తోంది.

ఈ క్రమంలో కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే అనేక పర్యాయాలు ఇరు రాష్ట్రాల ఇండెంట్లను పట్టించుకోని యాజమాన్య బోర్డు ఇప్పటికీ సమస్యను నానుస్తూనే ఉంది. ఈ నిర్లక్షాన్ని తెలంగాణ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. ఫలితంగా రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో కుదిరిన రాతపూర్వక ఒప్పందాల ఉల్లంఘన.. నేటికీ అపరిష్కృతంగా మిగిలిపోయింది.

రాష్ట్ర పునర్విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఒక ఏడాదికి మాత్రమే పరిమితమని తెలంగాణ వాదిస్తోంది. 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల పున:పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. శ్రీశైలం నుంచి 34 టీఎంసీలకు మించి వినియోగించుకునేందుకు ఏపీకి హక్కులు లేవు.. అయినా శ్రీశైలం జలాలను కృష్ణా బేసిన్‌ అవతలకు ఏపీ తరలిస్తోంది.. ఉమ్మడి రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో 20 శాతం తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ చెప్పినా అమలు కావటం లేదు. నిబంధనల ప్రకారం ఒక ఏడాదిలో కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్‌ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

చెన్నై తాగునీటి సరఫరా కోసం 1976-77లో కుదుర్చుకున్న ఒప్పందాలకు లోబడి నిబంధనలు ఖరారు చేసి అమలు చేయాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల వద్ధ జలవిద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించిన నిబంధనలను సవరణ చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాగార్జున సాగర్‌ లోని కృష్ణ జలాల కేంద్రంగా మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తింది. సాగర్‌ జలాల వాడకం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నాయి.

ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు కృష్ణ బేసిన్‌ లోని ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాలకు భారీగా వరద రావడంతో పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కానీ శ్రీశైలంకు కొంత నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం లేదు. దీంతో నాగార్జునసాగర్‌ జలాల వాడకంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతేడాది తాము వినియోగించుకోకుండా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ లో పొదుపు చేసిన 18 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, ఈ నీళ్లను వినియోగంపై తమకే హక్కు ఉందని తెలంగాణ చెబుతోంది.

ఈ నీటిని క్యారీ ఓవర్‌ కింద తాము ఈ నీటి సంవత్సరం 2023-24లో తొలి సీజన్‌లో తాగు, సాగునీటి అవసరాలకు వాటిని వినియోగించుకుంటామని తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. కృష్ణా జలాలకు సంబంధించి గత ఏడాది నిల్వను ఇప్పుడు వినియోగించుకుంటున్నందున దీన్ని ఈ ఏడాది కోటా కింద పరిగణించవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ 18 టీఎంసీల నీటిని వాడుకోవడం ద్వారా ఏపి నీటి హక్కులకు ఎలాంటి భంగం కలగదని తెలంగాణ నీటి పారుదల అధికారులు లేఖలో పేర్కొన్నారు. తాము వాడుకోకుండా పొదుపు చేసిన కృష్ణా జలాలను నిల్వ చేసుకోవడానికి తమకు ప్రత్యేకంగా ఆఫ్‌లైన్‌ జలాశయాలు లేకపోవడంతో 2023-24 నీటి సంవత్సరానికి సంబంధించిన తాగు, సాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయం సాగర్‌లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో అదనపు కేటాయింపులు

చట్ట ప్రకారం బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కేవలం బచావత్‌ పంపిణీ చేసిన 811 టీఎంసీలకు అదనంగా కొత్తగా నీటి లభ్యతను గుర్తిస్తే ఆ జలాలను పంపిణీ చేయటానికి మాత్రమే పరిమితమవుతుంది. కొత్తగా నీటి లభ్యతను గుర్తించినందు వల్లనే విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో ఏపీలో అదనంగా నాలుగు ప్రాజెక్టులకూ, తెలంగాణలోని రెండు ప్రాజెక్టులకు కృష్ణా జలాలను కేటాయించారు. ఏపీలో తెలుగుగంగ విస్తరణకు 29, గాలేరు-నగరి ప్రాజెక్టుకు 38, హంద్రీనీవాకు 40, వెలిగొండ కు 43.50 టీఎంసీలు.. మొత్తం 150.50 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణలోని కల్వకుర్తికి 25, నెట్టంపాడుకు 22 టీఎంసీలు..మొత్తం 47 టీఎంసీలు కేటాయించారు. దీనిపై తెలంగాణకు స్పష్టత ఉన్నా వివాదం రగలించటం ద్వారా కృష్ణా జలాల్లో అదనపు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తోందని ఏపీలోని నీటిపారుదల శాఖ అధికారులు, నిపుణులు భావిస్తున్నారు.

ఏపీ దూకుడుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం

2023-24 నీటి సంవత్సరంలోనూ కృష్ణాలో 66:34 శాతానికి కట్టుబడి పర్యవేక్షణ చేపట్టాలనీ, నిర్వహణ, నియమావళిని ఖరారు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ తాజాగా మార్గనిర్దేశం చేసింది. రిజర్వాయర్లు, సాగుయోగ్యమైన భూమి, నీటిపారుదలకు అవకాశమున్న స్థిరీకరణ ఆయకట్టు-ను అనుసరించి బచావత్‌ ట్రిబ్యునల్‌ కృష్ణా జలాల్లో ఏపీకి 66శాతం, తెలంగాణకు 34 శాతం కేటాయింపులు చేసింది. గతేడాది ఏపీకి కేటాయించిన నీటి వాటాకు మించి 51.745 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించిందని తెలంగాణ సర్కార్‌ ఆరోపించింది.

సాగర్‌ కుడి కాల్వ కింద వార్షిక తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలు మాత్రమే కృష్ణా రివర్‌ బోర్డు కేటాయించిందని, తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ లోని 5 టీఎంసీల నీళ్లను కేటాయించాలని గత నెలలో ఏపీ కోరడం పట్ల లేఖలో తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. 2022-23లో 205 టీఎంసీలను, 34:66 నిష్పత్తిలో 51 టీఎంసీలను ఏపీ ఎక్కువగా వాడుకుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అదనంగా వినియోగించుకున్న 51టీఎంసీలను ఈ సంవత్సరపు ఏపీ నీటి కోటా నుంచి మినహాయించాలని బోర్డును తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. త్వరలో జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా రివర్‌ మేనేజ్మెంట్‌ బోర్డును తెలంగాణ కోరింది.

2014 నాటి రాతపూర్వక ఒప్పందాలు ఉల్లంఘన

2014 రాష్ట్ర పునర్విభజన అనంతరం కేంద్ర జలశక్తి సమక్షంలో రెండు రాష్ట్రాల మధ్య రాతపూర్వక ఒప్పందాలు కూడా కుదిరాయి. తెలంగాణ మాత్రం ఆ ఒప్పందాలను తిరగోడాలనీ, కృష్ణా జలాలను 50:50 శాతం ప్రాతిపదికన పున:పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. పున:పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కూడా వాదిస్తోంది. ఈ మేరకు కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు హామీతో గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ పున:పంపిణీ చేసి తీరాలని పట్టుబడుతోంది. తెలంగాణ వాదనపై సమగ్ర అధ్యయనం చేయటమే కాకుండా న్యాయ నిపుణులతో చర్చించిన కేంద్ర జలశక్తి శాఖ పున:పంపిణీ సాధ్యం కాదని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ -1 అవార్డును అనుసరించి 66:34 నిష్పత్తి మేరకే కేటాయింపులుంటాయని కృష్ణా బోర్డుకు స్పష్టం చేసింది.

పాత ట్రిబ్యునళ్ళ ఆదేశాలను పున:సమీక్షకు నో చాన్స్‌!

అదనపు జలాల కోసమే బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు సుప్రీంకోర్టు డిగ్రీతో సమానం. అందువల్లనే బచావత్‌ తరువాత బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ వచ్చినా పాత్ర ట్రిబ్యునల్‌ ఆదేశాలను తిరగదోడలేదని ఏపీ గుర్తు చేస్తోంది. అంతర్‌ రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 చట్టంలోని సెక్షన్‌6 (2) ప్రకారం కొత్త ట్రిబ్యునళ్ళు పాత ట్రిబ్యునల్‌ ఆదేశాలను పున:సమీక్షించటానికి ఏర్పడవు. అపరిష్కృతంగా ఉన్న వివాదాల పరిష్కారం, కొత్తగా అందుబాటు-లోకి వచ్చిన జలాలను పంపిణీ చేయటానికే కొత్త ట్రిబ్యునళ్ళు పనిచేస్తాయి. అందువల్లనే బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కేవలం కృష్ణాలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అదనంగా అందుబాటులోకి వచ్చే 163 టీఎంసీలు, వరదల సమయంలో సమకూరే 285 టీఎసీంసీల మిగులు జలాలు.. మొత్తం కలిపి 448 టీఎంసీలను ఏపీ, తెలంగాణ, కర్ణాటకలకు పంచే విషయానికే పరిమితమైందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నెల 21న త్రిసభ్య కమిటీ భేటీ

తెలంగాణ, ఏపీలకు ఆగస్టు, సెప్టెంబరులకు నీటిని కేటాయించేందుకు ఈ 21న హైదరాబాద్‌లో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా రివర్‌ మేనేజ్మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో ఉన్న నీటి నిల్వలు, వినియోగంపై త్రిమెన్‌ కమిటీ చర్చించనుంది. శ్రీశైలం నుంచి ఆగస్టు చివరి వరకు తాగు, సాగు నీటి అవసరాలకు 16 టీ-ఎంసీలను కేటాయించాలంటూ ఏపీ.. కృష్ణా రివర్‌ మేనేజ్మెంట్‌ బోర్డుకు ఇండెంట్‌ పెట్టింది. రెండు రాష్ట్రాల ఇండెంట్లపై తమ అభిప్రాయాలను తెలపాలని బోర్డు ఇరు రాష్ట్రాలను కోరింది. మొత్తానికి మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల జగడం ఎటు దారి దారితీస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement