పేదల ప్రభుత్వం వచ్చిన తర్వాత రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అనేక కష్టాలు పడి తనను మంచి మెజారిటీతో గెలిపించారని, మీరిచ్చిన అవకాశంతోనే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. సోమవారం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం, కొత్తూరులో ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పాలేరు నుంచి అత్యధిక మెజారిటీ రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజల న్యాయమైన కోరికలు నెరవేరుస్తా..
ఆనాడు జరిగిన ఎన్నికల సభలో ప్రజల కోరికలు నెరవేరుస్తానని మాటిచ్చానని, మీరు అడిగిన న్యాయమైన కోరికలు తీరుస్తానని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి అన్నారు. రాబోయే ఏడాది లోపే పాలేరులోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గడిచిన పదేళ్లలో పేదవారికి ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని, అర్హులైన వారికి ఆసరా పెన్షన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఇరవై రెండున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. కాగా, ప్రధాన ప్రతి పక్షం కల్లబొల్లి మాటలు మాట్లాడితుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు. పేదవారిని విస్మరించిన బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.