జగిత్యాల : ధర్మపురి నరసింహా స్వామి దయతో గోదావరి ఉధృతి తగ్గిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ధర్మపురి మంగలిగడ్డ ప్రాంతంలో గోదావరి వరద ఉధృతిని పరిశీలించి గంగమ్మ తల్లి కి కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ భాస్కర్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్, తదితరులు ఉన్నారు.