కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం ప్రారంభమయ్యే జాతర ఇది.. మొదటి ఆదివారం కావడంతో నేడు ఆలయానికి భక్తులు పోటెత్తారు. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతున్నది. మొదటి ఆదివారాన్ని పట్నం వారం అంటారు. నేడు పెద్దసంఖ్యలో హైదరాబాద్ భక్తులు పాల్గొంటారు కాబట్టి దానికి ఈపేరొచ్చింది.
పట్నం సందర్భంగా ఆదివారం అధిక సంఖ్యలో నగరానికి చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈనెల 23న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయవర్గాలు నిర్వహించనున్నాయి. ఆలయ సంప్రదాయం మేరకు హైదరాబాద్ ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఆలయవర్గాల పర్యవేక్షణలో వీటిని నిర్వహిస్తారు. పట్నం వారానికి తరలివచ్చిన భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న ఆనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో చేపడతారు. పట్నంవారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆ దీక్షలు విరమిస్తారు. స్వామి వారితో పాటు పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తారు. నేడు లక్ష మంది వరకు భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం, పట్నం వారం, లష్కర్‌వారం, మహా శివరాత్రి రోజున నిర్వహించే పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయవర్గాలు ఆలయం, రాజగోపురం, గదులకు రంగులు వేయించి సుందరంగా ముస్తాబు చేశారు.తొమ్మిది వారాలు కొనసాగనుంది ఈ జాతర.