హాస్పిటల్సా లేకా ఆపార్ట్ మెంట్లా అంటూ కామెంట్స్
స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు
రాజస్థాన్, ఢిల్లీలో బహుళ అంతస్తులలోనే హాస్పిటల్స్
అవగాహన లేని మంత్రి అంటూ విమర్శ
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన టిమ్స్ ఆసుపత్రులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం చిమ్ముతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. జనాభా అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించామన్నారు. కానీ ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికొదిలేసిందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏనుగుల రవీందర్ రెడ్డికి మద్దతుగా నేడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ….. ఆర్ అండ్ బీ మంత్రికి టిమ్స్ ఆసుపత్రుల పట్ల కనీస అవగాహన లేదని విమర్శించారు. ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. జి + 14 తరహాలో హాస్పిటల్స్ నిర్మిస్తుంటే జి+24 అంటూ అవగాహన లేమితోనే మంత్రి మాట్లాడారంటూ మండిపడ్డారు హారీశ్ రావు.
రాజస్థాన్, ఢిల్లీలో బహుళ అంతస్థుల హాస్పిటల్స్
అదే నిజమైతే రెండేళ్ల క్రితం నాటి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్మించిన 24 అంతస్తుల ఆసుపత్రి కనిపించలేదా ? అని నిలదీశారు. కేజ్రీవాల్ ఢిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు చూడటం లేదు ? అని ప్రశ్నించారు. పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలను పెంచాలన్నారు.
ఆరు నెలల్లోనే బండారం బట్టబయలు..
ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని… ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను నమ్మించి చేతులెత్తేశారని హరీశ్ రావు మండిపడ్డారు. మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు వచ్చేది, నీళ్లు ఉండేవి.. రేవంత్ సర్కారులో కరెంటు లేదు, నీళ్లు లేవు.. వాటర్ ట్యాంకర్లు వచ్చాయి, బోర్ల బండ్లు వచ్చేశాయి అంటూ వివరించారు. పదేళ్లు కేసీఆర్ సుపరిపాలనను అయిదు నెలల్లోనే కుప్పకూల్చిన ఘనత రేవంత్ సర్కార్ దే నంటూ మండిపడ్డారు హరీశ్ రావు.