తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య శుక్రవారం మరోసారి సంవాదం నడిచింది. ఇవాళ అసెంబ్లీలో కడియం శ్రీహరి మాట్లాడుతూ… తన నియోజకవర్గం స్టేషన్ ఘన్ పూర్ నుంచి సైనిక్ స్కూల్ ను తరలించవద్దని అలాగే రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ను మార్చవద్దని ప్రభుత్వాన్ని కోరారు.
కడియం ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు వేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు సైనిక్ స్కూల్ ఎందుకు తీసుకురాలేక పోయారని కౌంటర్ వేశారు. 2017లో స్టేషన్ ఘన్ పూర్ కు సైనిక్ స్కూల్ మంజూరైతే దాన్ని ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నారని కడియం అంటున్నారు. కొత్త సైనిక్ స్కూల్స్ వచ్చినప్పుడు కొత్త ఏరియాలోనే ఏర్పాటు చేయిస్తామన్నారు.
2017లో శాంక్షన్ అయితే మొన్నటి వరకు 9 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని అలాగే బీజేపీ ప్రభుత్వంలో వారికే ఫ్రెండ్షిప్ ఉందని అప్పుడు ఎందుకు పూర్తి చేయించుకోలేదని సెటైర్ వేశారు. అయినా తాము ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రాష్ట్ర చిహ్నం మార్పులపై త్వరలో కమిటీ వేస్తామంటూ కోమటిరెడ్డి సమాధానం ఇచ్చారు. నిపుణుల కమిటీ వేసి చిహ్నం ఎలా ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు.