దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ..ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టాలని సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ కు గొర్రెలు, బర్రెలు గుర్తుకొస్తాయని విమర్శించారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన అన్నీ మర్చిపోతారని అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని… రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా… గ్రామాలను అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీలు నిధులు లేక ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై చెయ్యేస్తే ఆ చేయిని నరికేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని… గ్రామస్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తలు లేరని ఎద్దేవా చేశారు.