Tuesday, November 19, 2024

నోటికి వ‌చ్చింది మాట్లాడ‌డం కేసీఆర్‌కు అలవాటు:ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి

క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతున్న వారిని ఆదుకోవ‌డంలో స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిప‌డ్డారు. ప్రాజెక్టుల్లో వ‌చ్చే క‌మీష‌న్ల మీద ఉన్న శ్ర‌ద్ద క‌రోనాతో బాధ‌ప‌డుతున్న వారి మీద లేద‌ని ఎద్దేవా చేశారు. నోటికి వ‌చ్చిన హామీలు ఇవ్వ‌డం వాటిని మ‌ర్చిపోవ‌డం కేసీఆర్‌కు ప‌రిపాటిగా మారింద‌ని దుయ్య‌బ‌ట్టారు. క‌రోనాకు ఆరోగ్య శ్రీలో చేర్చ‌డం మ‌ర్చిపోయారు… రైతుల వ‌ద్ద ధాన్యం కొలుగోలు చేయ‌డం మ‌ర్చిపోయారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా కాలంలో 15నెల‌లుగా ప్ర‌తి గ్రామంలో కాంగ్రెస్ నేత‌లు ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు కానీ ప్ర‌భుత్వం మాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోవ‌ట్లేద‌ని మండిప‌డ్డారు. క‌రోనా కోసం వేల కోట్లు అయిన ఖ‌ర్చు చేస్తాన‌ని… అసెంబ్లీ సాక్షిగా క‌రోనాను ఆరోగ్య‌శ్రీలో చేర్చుతాన‌ని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ విష‌యం మ‌ర్చిపోయార‌ని మండిప‌డ్డారు. అస‌లు క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చితే స‌ర్కార్‌కు ఎలాంటి న‌ష్టం వ‌స్తుంద‌ని ప్రశ్నించారు. దీంతో కొంత‌మేర‌నైనా పేద ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గేద‌ని వివ‌రించారు.

ప్ర‌భుత్వ వైద్యం దొర‌క‌క‌ కార్పోరేట్ ఆస్ప‌త్రుల్లో చేరితే చికిత్స కోసం భూములు, బంగారం అమ్ముకుని రోడ్డున‌ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌క్క రాష్ట్రంలో ప్ర‌భుత్వాలే కార్పోరేట్ ఆస్ప‌త్రుల్లో ఉచితంగా వైద్యమందిస్తుంటే.. ఇక్క‌డ మాత్రం స‌ర్కార్ మెడిసిన్ సైతం సరిగా ఇవ్వ‌డం లేదని విమ‌ర్శించారు. అలాగే జ‌ర్నలిస్టుల‌ను ఫ్రంట్ లైన్ వారియ‌ర్లు గుర్తించాల‌ని చెబుతున్న ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని తెలిపారు. ఎంతో మంది జ‌ర్న‌లిస్టుల విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కొల్పోతున్న ఇప్ప‌టికీ వారి కుటుంబాల‌ను ఆదుకోవ‌డం లేద‌న్నారు. ఇప్ప‌టీకైనా క‌రోనాతో చ‌నిపోయిన జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు…

ఇక నెల రోజుల‌గా ధాన్యం అమ్మ‌కానికి రైతులు మార్కెట్‌కు వ‌స్తే ఇప్ప‌టికీ ధాన్యం కొనుగోలు చేయ‌కుండా వారితో క‌న్నీరు పెట్టిస్తున్నార‌ని తెలిపారు. నైరుతి రుతుప‌వ‌నాలు వ‌చ్చి వ‌ర్షాలు ప‌డుతున్న ఇంకా ధాన్్యం ఎందుకు కొన‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సర్కార్ కొన‌క‌పోవ‌డంతో ద‌ళారుల‌కు అమ్మితే పెట్టిన పెట్టుబడి సైతం రైతుల‌కు రావట్లేద‌ని వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement