ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్
ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు
ఏకంగా పదివేల మంది అభ్యర్ధులు కుటుంబాలతో రాక
నిరుద్యోగులకు కొత్త వరాలు ప్రకటించే అవకాశం
నగరంలో నేటి మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ అంక్షలు
హైదరాబాద్ : నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి తీరుతామని అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ధీమాగా ప్రకటించి.. ఆ దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టిన రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు తాము ఎంచుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. సమాజాన్ని ఉద్ధరించే బాధ్యత కలిగిన ఉపాధ్యాయ పోస్టుల్లోనూ గరిష్ఠ సంఖ్యలో నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలోనే డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణలైన 11,062 మంది నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించనున్నారు. అందుకోసం బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంపికైన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి వారందరి సమక్షంలో నియామక పత్రాలను అందజేయనున్నారు. అందుకోసం అన్ని జిల్లాల నుంచి వారిని రప్పించేందుకు ప్రభుత్వమే ప్రత్యేక బస్సులను, ఇతర సదుపాయాలను కూడా ఏర్పాటు చేసింది.
ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు…
ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరినీ మధ్యాహ్నం రెండు గంటల లోపే ఎల్‌బీ స్టేడియానికి చేరేలా తగు ప్రణా ళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను హైదరాబాదుకు చేర్చడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించారు. జిల్లా నుండి వచ్చే బస్సులను వేదికకు సమీపంలోనే తగు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులను స్టేడియం సమీపంలోనే దించే విధంగా చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్‌కు సూచించారు.
నగరంలో వర్షం వచ్చే అవకాశం ఉన్నందున రేయిన్ ప్రూఫ్ షామియానాను వేయాలన్నారు. ఈ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని, మౌలిక సదు పాయాలు కల్పించాలని ఆదేశించారు. స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు గానూ జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.