Saturday, November 23, 2024

ABD | కొలం గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలి.. జిల్లా ఎస్పీ గౌస్ ఆలం

ఇంద్రవెల్లి : కొలం గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్ని అదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సమ్మక్క మండలం పాతగూడ గ్రామంలో ఇవ్వాల (గురువారం) పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆగ్రామ మహిళలు ఎస్పీకి మంగళ హారతి ఇచ్చి గుస్సాడి నృత్యాల నడుమ కొలం గిరిజనుల సంస్కృతీ సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొలం గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్యంగా యువత విద్య పైన ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. సంస్కృతీ సంప్రదాయాలతో పాటు విద్య కూడా చాలా అవసరమన్నారు. పోలీసులు మీకోసం పనిచేస్తున్నామని ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. కొలం గిరిజనుల అభివృద్ధి కోసం తను ఎల్లపుడూ అండగ ఉంటానన్నారు.జిల్లాకు రాకముందు ఇక్కడ పనిచేసి అనుభవం ఉన్న అధికారులతో సమీక్షించి వచ్చానన్నారు.

ఈ జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొలం గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ త‌రువాత‌ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభా స్థలి వద్ద లక్ష రూపాయల విలువ గల మూడు వందల దుప్పట్లను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ రెడ్డి, సిఐ రామకృష్ణ, ఎస్సై డీ,సునీల్ ఎంపిటిసి మడవి భీం రావ్,గ్రామ పటేల్ లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement