కొడంగల్ : కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి, ఇక్కడి రైతుల పాదాలను కడుగుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. కోస్గిలో 50 పడకల ఆస్పత్రిని మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి చక్కగా పని చేస్తడలేడని ఆయనను ఓడగొట్టి.. పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించుకున్నారు అని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆనాడు కొడంగల్ నియోజకవర్గంలో ఆస్పత్రి లేకుండే. ఇవాళ కోస్గిలో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించుకున్నాం. కొడంగల్‌లో గతేడాది 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించుకున్నాం. మద్దూరులో 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించాం. నేను పెద్ద నాయకుడిని అని రేవంత్ రెడ్డి అంటడు. రేవంత్ రెడ్డిని అన్ని సార్లు గెలిపిస్తే కనీసం కొడంగల్, కోస్గికి సర్కార్ దవాఖానాను తేలకపోయాడు. మీరు నరేందర్ రెడ్డిని గెలిపించారు కనుక మూడు ఆస్పత్రులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఇక వైద్యం కోసం నారాయణపేట, మహబూబ్‌నగర్, తాండూరు పోవాల్సిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలతో వైద్య సదుపాయాలు కల్పించాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనేటోళ్లు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పోదాం పదా బిడ్డ సర్కార్ దవాఖానాకు అనే అంత గొప్పగా ఆస్పత్రులను అభివృద్ధి చేశాం. పైసా ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పని చేసిందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.