- పోరాటయోధునికి ఘననివాళి
- ఆదివాసుల పూజలతో పులకించిన జోడేఘాట్
ఆంధ్రప్రభ స్మార్ట్ , ఆదిలాబాద్ బ్యూరో : భూమికోసం, భుక్తి కోసం, ఆదివాసి హక్కుల కోసం, నిజాం రజాకర్ల నియంతృత్వంపై పోరాడి అమరుడైన మన్యంవీరుడు కొమరం భీంనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నివాళులర్పించారు. గురువారం కొమరం భీం జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఐటీడీఏ 84వ వర్దంతి సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కొమురం భీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, ఎంపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొమరం భీం ఆశయాల సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పూజలతో పులకించిన జోడేఘాట్..
కొమరం భీమ్ అసువులు బాసిన జోడేఘాట్ లో కొమరం భీమ్ మనవడు సోనేరావు, ఆయన వంశస్థులు ఉదయం నుండే సంప్రదాయ ఆదివాసీ పూజలు నిర్వహించారు. ఆదివాసుల ఆరాధ్య దైవం పెర్సపెన్, గోండు వంశం ఆచారాల మేరకు పూజలు చేశారు. కొమరం భీం పోరాట గాథలను స్మరించుకున్నారు. భీమ్ మృతి చెంది 84 ఏళ్ళు గడుస్తున్నా… పాలకులు కొమరం భీమ్ ఆశయాలను నెరవేర్చడం లేదని అన్నారు.
పోడు భూముల పట్టాల కోసం, అడవిలో హక్కు కోసం మరో ఉద్యమాలకు సిద్ధం కావలసి వస్తుందని గిరిజన నేతలు పేర్కొన్నారు. జోడేఘాట్ వర్ధంతి సభ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రీ, ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా, వివిధ పార్టీల నాయకులు గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు.