Thursday, November 21, 2024

KNR : భూ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలి… కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష


మంథని, అక్టోబర్‌ 8 (ప్రభ న్యూస్‌): మంథనిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం మంథని రెవెన్యూ డివిజన్‌ అధికారి కార్యాలయంలో మంథని అభివృద్ధి పనులకు భూ కేటాయింపులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ… మంథనిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. అభివృద్ధి పనులకు గుర్తించిన ప్రభుత్వ భూములను సంబంధిత శాఖలకు బదలాయించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

మంథనిలో కమ్యూనిటీ- హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి 3ఎకరాలు, తహసీల్దార్‌, రెవెన్యూ డివిజన్‌ అధికారి, రోడ్లు భవనాల శాఖ కార్యాలయం భవనాల నిర్మాణాలకు 2 ఎకరాల 21 గుంటలు, కళాభారతి నిర్మాణానికి 8 గుంటలు, కమ్యూనిటీ- హాల్‌ భవనం, ఆర్‌ అండ్‌ బీ అతిధి గృహం నిర్మాణానికి ఎకరం, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి 30 గుంటలు, అడవి సోమనిపల్లిలో సమీకృత గురుకులాల నిర్మాణానికి 25 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించి సంబంధిత శాఖలకు బదలాయించాలని కలెక్టర్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

మంథని పట్టణంలో దేవాదాయ శాఖ పరిధిలో అనుకూలమైన భూములు ఉంటే వాటికి ప్రస్తుతం మార్కెట్‌ విలువను సదరు దేవాలయానికి చెల్లించి అభివృద్ధి పనులకు కేటాయించాలని కలెక్టర్‌ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్‌ అధికారి వి.హనుమా నాయక్‌, మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రమాదేవి, మున్సిపల్‌ కమిషనర్‌, ఈఈ ఆర్‌ అండ్‌ బీ భావ్‌ సింగ్‌లు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement