సీఎం కేసీఆర్ కామారెడ్డిలోనూ, గజ్వేల్‌లోనూ ఓటమి పాలవుతారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఫైర్ అయ్యారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితమే తెలంగాణవ్యాప్తంగా రాబోతోందని కిషన్‌రెడ్డి అన్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణ యువత సునామిలా విజృంభించి బీఆర్‌ఎస్‌ను తుడిచిపెడుతుందని ప్రకటించారు. ప్రజా ఆందోళనలను అణిచివేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులను కలిసే వీలు లేకుండా పోయిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని.. కేసీఆర్ మాట తప్పారని.. ఉద్యోగ నియామకాల్లో విఫలమయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో వచ్చే వ్యతిరేకత కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే వచ్చిందని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు డబ్బు పంపించేందుకు కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు.