న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన వెయ్యి కోట్ల నిధులలో ఇప్పటివరకు రూ. 392 కోట్లను కేంద్రప్రభుత్వం విడుదల చేసినట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. వరంగల్, కరీంనగర్ నగరాలకు స్మార్ట్ సిటీ మిషన్ పథకం కింద విడుదల చేయవలసిన 50 శాతం మ్యాచింగ్ గ్రాంట్ నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిగా విడుదల చేయలేదన్నారు. రూ. 392 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ నిధులలో కేవలం రూ. 210 కోట్లను మాత్రమే విడుదల చేసిందని చెప్పారు.
స్మార్ట్ సిటీ మిషన్ పథకం ప్రారంభమైన 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం నిధులను కేటాయిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మ్యాచింగ్ గ్రాంట్ నిధులను ఆరేళ్లు ఆలస్యం చేసి చివరకు కేంద్రం ఒత్తిడి మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రమే కేటాయిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర నిధులను సమయానికి విడుదల చేసి ఉంటే వరంగల్, కరీంనగర్ నగరాలలో సరైన డ్రైనేజి సౌకర్యం ఇప్పటికే అందుబాటులోకి వచ్చి ఉండేదని, ఆయా నగరాలలో ఇటీవల సంభవించిన వరదల ప్రభావం కొంచెం తక్కువగా ఉండేదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
స్మార్ట్ సిటీస్ మిషన్ పథకం ద్వారానే కాకుండా అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలోని పట్టణాలలో మెరుగైన సౌకర్యాలను కల్పించటం కోసం రూ. 2,780 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, అమృత్ పథకం మొదటి దశలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 12 పట్టణాలలో రుూ 1,660 కోట్ల వ్యయంతో 66 ప్రాజెక్టులను చేపట్టిందని ఆయన వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వ్యవసాయం, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, మైనింగ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖలన్నీ కూడా కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయని కిషన్రెడ్డి విమర్శించారు. స్మార్ట్ సిటీలకు విడుదల చేసే నిధులపై టీఆర్ఎస్ పార్టీ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ద్వారా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారాన్ని ఏ రకంగా సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 392 కోట్లలో దాదాపు 80 శాతం నిధులను గత 2 ఆర్థిక సంవత్సరాలలోనే వినియోగించారని, అందులో 40శాతం నిధులను 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేసినట్టు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్ళించి, కొంత జాప్యం తర్వాత తిరిగి వరంగల్ స్మార్ట్ సిటీకి బదిలీ చేశారని కిషన్రెడ్డి ఆరోపించారు.
దేశంలోని అన్ని పట్టణాలలోని ఇళ్ళన్నిటికీ మంచి నీటి కుళాయి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించినట్టు గుర్తు చేశారు. 2016-21 మధ్య సాగిన మొదటి దశలో రూ. 1,660 కోట్ల వ్యయంతో 66 ప్రాజెక్టులకు ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. 12 పట్టణాలను కలిపి రూపొందించిన ఈ ప్రణాళికలో రూ. 832 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం అందించిందని ఆయన వివరించారు. వార్షిక బడ్జెట్ నివేదికను పరిశీలిస్తే స్మార్ట్ సిటీస్ పథకంపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిరాసక్తితో ఉందో అర్థమవుతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలకులు కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపడం ఆపి రాష్ట్ర పాలనపై దృష్టి సారించాలని కిషన్రెడ్డి హితవు పలికారు.