Monday, November 25, 2024

Kishan Reddy Appeal – ఎయిమ్స్ ఎక్స్ టెన్ష‌న్ సెంట‌ర్ కు స్థ‌లం కేటాయించండి

ముఖ్య‌మంత్రి రేవంత్ కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి లేఖ‌
బిబీన‌గ‌ర్ ఎయిమ్స్ అనుబందంగా హైద‌రాబాద్ లో సెంట‌ర్
వైద్య విద్యార్దుల‌కు ట్రైనింగ్ కోసం ఈ కేంద్రం
రెండు ఎక‌రాల భూమి కేటాయించండి
తాత్కాలికంగా కేంద్రం నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వ భ‌వ‌నాన్ని ఇవ్వండి..

హైద‌రాబాద్ – ఎయిమ్స్ బీబీనగర్ కు అనుబంధంగా హైదరాబాద్ అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటుకు వీలుగా రెండు ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించాల‌ని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అలాగే తాత్కాలిక సెంట‌ర్ ను నిర్వ‌హించేందుకు వెంట‌నే ఏదైన ప్ర‌భుత్వ భ‌వ‌నాన్ని కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు నేడు సిఎంకు ఒక లేఖ రాశారు.

ఈ లేఖలో దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడానికి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మొదలుకొని అన్ని స్థాయిలలో ఆరోగ్య కేంద్రాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులో ఉంచడానికి మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆ లేఖ‌లో ప్ర‌స్తావించారు.. అందులో భాగంగానే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎయిమ్స్ ఆసుపత్రులను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పుతోందని., అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా 2019 లో బీబీనగర్ లో రూ. 1,300 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం మీకు తెలిసిందే అంటూ పేర్కొన్నారు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం ఎయిమ్స్ బీబీనగర్ లో ఓపీడీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్ మెడికల్ కాలేజీని కూడా కొత్తగా ఏర్పాటు చేయడం, ప్రస్తుతం వైద్య కళాశాల తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్ నూతన భవనాలు చాలా వేగవంతంగా నిర్మాణం జరుగుచున్నవి. ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ నగరంలో ఒక అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వైద్య విద్యార్థులకు అవసరమైన బోధన & శిక్షణ కార్యక్రమాలను, నగరంలో నివశిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని స్థ‌లాన్ని, తాత్కాలిక భ‌వ‌నాన్ని ఎయిమ్స్ కోసం కేటాయించాల‌ని కిష‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement