కిన్నెర వాయిద్యకారుడు, బీమ్లానాయక్ పాటతో పాపులర్ అయిన తెలంగాణ కళాకారుడు మొగులయ్య ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తనకు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు మొగులయ్య sతెలిపారు. గతంలో ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడమే తన జీవితాన్ని మార్చిందని అన్నారు. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో తన కళను చేర్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరుపున కళాకారుల ఫించను రూ. 10 వేల సహాయాన్ని తమ కుటుంబానికి కల్పించినందుకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పాటను పాడి ఆలపించారు కిన్నెర మొగులయ్య.
కిన్నెర వాయిద్యాన్ని అభివృద్ధి చేసి మరిన్ని వాయిద్యాలు, కళాకారులను తయారు చేయాలనే తన లక్ష్యానికి ప్రభుత్వ సాయాన్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కిన్నెర మొగులయ్యని శాలువాతో సన్మానించి, తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేసారు. సీఎం కేసార్ సాంస్కృతిక రంగానికి అనేక రకాలుగా అండగా ఉన్నారని మంత్రి గంగుల అన్నారు. ఉద్యోగాలు సైతం ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కళా, సాంస్కృతిక రంగాలను నిరంతరం ప్రోత్సహిస్తుందన్నారు. మొగులయ్యకు అండగా ఉంటామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు.