హైదరాబాద్: సరూర్‌నగర్ డివిజన్‌లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం రేపింది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో అలకనంద ఆసుపత్రిని నాగేందర్, వైద్యులు పరిశీలించారు. కిడ్నీ శస్త్రచికిత్సలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఇక మల్లికార్జున్, కిరణ్మయి, సాధనరాయ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరంతా కిడ్నీ రాకెట్లో నిజానిజాలు తేల్చనున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఉన్న బాధితులను ఈ బృందం కలవనుంది.
ఇది ఇలా ఉంటే సరూర్నగర్లోని అలకనంద ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయనే సమాచారంతో మంగళవారం రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, పోలీసులు దాడులు చేశారు. తనిఖీల్లో భాగంగా కిడ్నీ మార్పిడి కోసం ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు నలుగుర్నీ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో 6నెలల క్రితం అలకనంద ఆసుపత్రి ప్రారంభమైంది. జ్వరం, ఇతర చిన్న చికిత్సలు చేయడానికి మాత్రమే ఆసుపత్రికి అనుమతి ఉంది. కానీ అనధికారికంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో వైద్యాధికారులు గీత, అర్చన, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డి మంగళవారం ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో నలుగురు చికిత్స తీసుకుంటూ కనిపించారు. వారి శరీరాన్ని పరిశీలించగా వీపు కింద భాగంలో పెద్ద శస్త్ర చికిత్స జరిగినట్లు గుర్తించారు. కిడ్నీ మార్పిడికి చేయించినట్లు ప్రాథమికంగా నిర్ధరించుకున్నారు. మరింత స్పష్టత కోసం వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలకనంద ఆసుపత్రిని సీజ్ చేసినట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసుపత్రి ఎండీ సుమంత్ చారీ, ఆసుపత్రి సిబ్బందిని అరెస్ట్ చేసినట్టు సరూర్‌నగర్ పోలీసులు తెలిపారు. . తాజాగా ఈ ఘటనపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.