- ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
- తాండూరు మండలం గౌతాపూర్‌లో కలకలం
తాండూరు రూరల్: అమ్మ కొంగుకు కట్టుకున్న ఏడాది బాలున్ని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో సోమవారం కలలకం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి చెందిన భాష అనే వ్యక్తి భార్య గోరీబీ, ముగ్గురు పిల్లలతో కలిసి గౌతాపూర్ గ్రామానికి వలస వచ్చాడు. గత కొన్ని రోజులుగా గ్రామంలో గ్యాస్ స్టవ్ రిపేర్లు, చిన్న చిన్న మరమ్మత్తుల పనులు చేసుకుంటున్నాడు.
ఆదివారం రాత్రి గ్రామంలోని మల్లన్న స్వామి కుటుంబంతో కలిసి గుడివద్ద నిద్రించారు. ఇవాళ ఉదయం తమతో ఉన్న ఏడాది వయస్సు ఉన్న బాలుడు కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో ఎత్తుకెళ్లి ఉంటారని భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా రాత్రి 11 గంటల వరకు బాబుతో ఆడుకున్నానని తల్లి కన్నీటి పర్యంతమైంది.
బాలుడు ఎక్కడికైనా వెళతాడేమా అని కొంగుకు కట్టేసుకున్నాని విలపించింది. తెల్లారి చూసే సరికి కొంగును విడిపించి ఎవరో తన కొడుకును ఎత్తుకెళ్లారని రోధిస్తూ చెప్పడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.