Friday, November 22, 2024

Exclusive | కిడ్నాప్ కేసు చిక్కు వీడింది.. ప్రాణ‌భ‌యంతోనే పారిపోయాన‌న్న తిరుప‌తిరెడ్డి

జనగామ నియోజకవర్గ బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి కిడ్నాప్‌ కేసు చిక్కు వీడింది. త‌న‌ను ఎవ‌రూ కిడ్నాప్ చేయ‌లేద‌ని, ప్రాణ భ‌యంతో తానే పారిపోయిన‌ట్టు తిరుప‌తి రెడ్డి తెలిపాడు. నాలుగు రోజుల క్రితం సంచ‌ల‌నం సృష్టించిన ఈ కిడ్నాప్ డ్రామాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కొస్తున్నాయి. భూ తగాదాల విషయంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అత‌ని అనుచరులు తన భర్తపై కుట్ర చేశారని తిరుపతిరెడ్డి భార్య ఆరోపించారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. తన భర్త అచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక‌.. మైనంపల్లి హన్మంతరావు తన అనుచరులతో తనను చంపించాలని యత్నించారని, మైనంపల్లి తనకు ఎనిమిదిసార్లు ఫోన్ చేశారని దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తిరుప‌తిరెడ్డి చెబుతున్నాడు. ఈ భయంతోనే తాను విశాఖ, విజయవాడ పారిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. కాగా, తన భర్త కిడ్నాప్ కు గురయ్యాడ‌ని తిరుపతిరెడ్డి భార్య సుజాత గురువారం రాత్రి అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీశారు. చివరకు విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు.

ఓల్డ్ అల్వాల్ లోని 566, 568ఆ, 571అ సర్వే నెంబర్ల పరిధిలో కోట్లాది రూపాయల విలువైన స్థలం పంపకాల్లో తిరుపతిరెడ్డికి, జనార్దన్ రెడ్డికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ భూవివాదంలో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని, తన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని తిరుపతిరెడ్డి గతంలో ఆరోపించారు. ఇదే సమయంలో ఆయన అదృశ్యం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement