మణుగూరు : మణుగూరు పట్టణ, మండల ప్రజలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని జడ్పీటీసీ పోశం నర్సింహారావు సృష్టం చేశారు. మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఆయన, సమస్య ఉందంటూ ఎవరొచ్చినా ఆ సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలకతీతంగా కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలోనే మణికంఠ నగర్ గ్రామస్తులు టీఆర్‌ఎస్ పార్టీని న్యాయం చేయమంటూ ఆశ్రయించారన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలలాగే తామూ ప్రయత్నించామని, బాధితులకు న్యాయం చేసేందుకు స్థలవిక్రేతను, కొనుగోలుదారులను, స్థల యజమానిగా పేర్కొంటున్న వారిని పలుమార్లు పిలిపించి, స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు సంప్రదింపులు జరిపామన్నారు. స్థల విక్రేతను సైతం గట్టిగా మందలించామని, అంతే తప్ప ఎక్కడా డబ్బుల ప్రస్తావన తీసుకు రాలేదన్నారు. డబ్బులను డిమాండ్ చేసినట్లు తనపై కొందరు బురద జల్లుతున్నారని, ఎటువంటి ఆధారాలున్నా నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. భూ వివాదంలో నిజాలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక పరమైన చర్చ ఎక్కడా ఎప్పుడూ జరగలేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎవరిని ఎప్పుడు ఎక్కడ డబ్బులడిగానో బహిరంగ చర్చ ద్వారా నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. అఖిల పక్షం పేరుతో రాజకీయాలు చేస్తున్న వారంతా, ఎక్కడెక్కడ ఎటువంటి సెటిల్‌మెంట్లు చేశారో, అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్న ఆయన, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామా అంటూ సవాల్ విసిరారు. రాజకీయాలు రాజకీయాలుగానే ఉండాలని, చిల్లర పనులు తగవంటూ ఆయన వారికి హితవు పలికారు. మణికంఠనగర్ బాధితులకు న్యాయం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..