Saturday, October 5, 2024

TG – రైతుల ఆలోచ‌న‌ల‌తోనే భ‌రోసా ఫైనల్​ – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

వ్య‌వ‌సాయ రంగాన్ని కాపాడుకుందాం
రైతు భ‌రోసా అమ‌లుపై దృఢ సంక‌ల్పం
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క
ఖ‌మ్మంలో ప్ర‌జాభిప్రాయ‌సేక‌ర‌ణ‌
రైతుల సూచ‌న‌ల‌పై అసెంబ్లీలో చ‌ర్చ : పొంగులేటి
అన్న‌దాత‌ను ఆదుకోవ‌డ‌మే ధ్యేయం: తుమ్మ‌ల‌

ఆంధ్ర‌ప‌భ స్మార్ట్ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : రైతుల ఆలోచ‌న‌తోనే రైతు భ‌రోసా విధివిధానాలు రూపొందిస్తామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన రైతు భ‌రోసా ప‌థ‌కం ప్ర‌జాభిప్రాయ‌సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.

- Advertisement -

దృఢ సంక‌ల్పంతో ముందడుగు : భ‌ట్టి

ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ రంగాన్ని కాపాడుకుందామ‌ని, అందులో భాగంగా పెట్టుబ‌డి అంద‌జేయడం కోసం రైతు భ‌రోసా అమ‌లు చేయ‌డానికి త‌మ ప్ర‌భుత్వం దృఢ సంక‌ల్పంతో ముంద‌డుగు వేస్తోంద‌ని చెప్పారు. రైతుభరోసాపై విధివిధానాల ఖరారు కోసం రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. అన్నిజిల్లాలో అభిప్రాయాలు సేకరించి, త్వరలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వంలా కాదు : పొంగ‌లేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏ స్కీమ్‌ చేపట్టినా ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదన్నారు. నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకుని ప్రజలపై రుద్దారన్నారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతీపైసా ప్రజల నుంచి వచ్చిందేనని, రైతులు ఇచ్చే సూచనలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

రైతుల‌ను ఆదుకోవ‌డ‌మే : తుమ్మ‌ల‌

ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ రైతుల ఆలోచన మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతుల అభిప్రాయం తీసుకున్నాకే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.రైతాంగాన్ని ఆదుకోవ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని అన్నారు.

రేపు ఆదిలాబాద్‌లో ప్రజాభిప్రాయ‌సేక‌ర‌ణ‌

రైతు భరోసా అమలుపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా అభిప్రాయాలను సేకరిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లాలో మంత్రుల బృందం ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల అభిప్రాయాన్నిసేక‌రించింది. జిల్లాల పర్యటన ముగిసిన తరువాత ప్ర‌భుత్వం తుది నిర్ణయం తీసుకుంటోంది. 11న అదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న సంగారెడ్డి(మెదక్), 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయాల్లో రైతుల నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్లు షెడ్యూల్‎ను రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement