భద్రాచలం : వరద ముంపు బాధితుల సర్వే వెంటనే పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో సర్వే బృందానికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వే బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. కుటుంబాల సంఖ్య, ఆర్థిక పరిస్థితి, ఎంత మేర నష్టం వాటిల్లింది, ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించాలన్నారు. ఒక్క ముంపు బాధిత కుటుంబాన్ని వడలకూడదని, సర్వే పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని ఆయన తెలిపారు. సర్వే సమయంలో బాధితులతో ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో వివరాలు ఇస్తే ఆ విషయము నివేదికలో పొందుపర్చాలన్నారు. బాధితులతో సంయమనంతో వ్యవహరించాలని, వాదన చేయకూడదని ఆయన అన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు సర్వే ను రాండంగా తనిఖీ చేయాలని ఆయన అన్నారు. సర్వే ను బుధవారం మధ్యాహ్నం కల్లా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
బూర్గంపహాడ్, సారపాక గ్రామాల్లో ముంపు బాధితులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బూర్గంపహాడ్ లో ముంపుకుగురైన 9 కాలనీల్లో 9 టీములు, సారపాక లో 6 కాలనీల్లో 6 టీములు ఏర్పాటుచేసి సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన అన్నారు. మంగళవారం వరకు పునరావాస కేంద్రాల్లో ముంపు బాధితులకు ఏర్పాట్లు, ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు, కేంద్రంలో ఉన్నవారి వివరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. బుధవారం నుండి ముంపు ప్రాంతాల్లో టీములు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, పునరావాస కేంద్రాలకు వెళ్లి, వివరాలు ఇవ్వనివారు, బంధువులు, ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి ఇండ్లకు వచ్చిన వారి వివరాలు సేకరిస్తారని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలో తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది క్రియాశీలకంగా ఉన్నట్లు, ఖమ్మం, హుజూర్ నగర్ ఆర్డీవోలు పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఏ ఒక్కరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని, బాధిత ప్రతి ఇంటికి ప్రభుత్వం నుండి సహాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు ఖమ్మం కలెక్టర్ సారపాక గ్రామంలో పర్యటించి, వరద ముంపు ఇండ్లను పరిశీలించారు. ముంపు బాధితులకు ప్రభుత్వం నుండి అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ సుందరయ్య నగర్ లో ముంపు ఇండ్లను పరిశీలించి, అక్కడ చేపడుతున్న సర్వే ను పరిశీలించారు. పాత సారపాక ప్రాంతంలో పర్యటించి వరదతో నష్టపోయిన ఇండ్లను పరిశీలించారు. వరద ఎక్కడివరకు వచ్చింది, ఎక్కడ పునరావాసం పొందింది గృహస్తులను అడిగి తెలుసుకున్నారు. బసవప్ప క్యాంపు ప్రాంతంలో పర్యటించి ముంపు ఇండ్లను పరిశీలించారు. సర్వే ప్రక్రియను పరిశీలించి, ఖాతా సంఖ్య స్పష్టంగా వ్రాయాలని, కావాల్సిన వివరాలు పూర్తిగా సేకరించాలని ఆయన అన్నారు. బూర్గంపహాడ్ గ్రామ మెయిన్ రోడ్, గొల్లబజార్ లలో పర్యటించి, వరద నీరు ఎక్కడివరకు వచ్చింది, ఆ సమయంలో ఎక్కడ భద్రత పొందింది అడిగి తెలుసుకున్నారు. గొల్లబజార్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ, త్రాగునీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.