ఖమ్మం : ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ అధ్వర్యంలో మొక్కజొన్న, ధాన్యం సేకరణ, రవాణా అంశంపై జిల్లా కలెక్టరేట్ లో సివిల్ సప్లై, మార్కెటింగ్, వ్యవసాయ, రవాణా, పోలీస్, రైస్ మిల్లర్ల అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇతర అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు కాగా దాదాపు 2లక్షల పై చీలుకు ధాన్యం సేకరణ కేంద్రాలు వస్తుందని, ఇప్పటి వరకు కేవలం 40వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణ జరిగిందని అధికారుల లెక్కల ప్రకారం నమోదు అయిందన్నారు. ధాన్యం సేకరణలో బాగా వెనుకబడి ఉన్నామని, ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎప్పుడూ లేదన్నారు. కొత్త కొత్త పాలసీలు జిల్లాలో మోపి రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీకు ప్రభుత్వంకు ఉన్న సమస్యలను రైతులపై రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే అందుకు సమాధానం చెప్పాల్సివస్తుందన్నారు. కరోనా క్లిష్ట సమయంలోనే 3లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నల ధాన్యం సేకరించామని, ఇప్పుడు దాన్ని అందుకోలేకపోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు.
మిల్లర్లు తరుగు పేరుతో 4కిలోలు తీసేయడం సరికాదని దీన్ని మార్చుకోవాలని సూచించారు. ధాన్యం రవాణాలో అంతరాయలు, అవాంతరాలు కలిగిస్తే వారి పై చర్యలకు వెనుకాడేది లేదని, ఇప్పటికైనా మీ పని తీరు మార్చుకుని ప్రభుత్వం సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల విధానాలు, రైతుబందు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాలతో పంట విస్థీర్ణం ఏటికేడు పెరుగుతూ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతు పండించిన చివరి గింజను మద్దతు ధరతో కొనాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. ప్రపంచవ్యాప్త నివేదికల్లో ఓవైపు యావత్ ప్రపంచంలో 20ఏళ్ల కనిష్టానికి బియ్యం ఉత్పత్తి పడిపోతుంటే, కేవలం తెలంగాణలో మాత్రమే బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందన్నారు ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని వెల్లడించారు.
సమీక్షలో విత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరి రావు, అదనపు కలెక్టర్ మధుసుధన్, DRDA PD విద్యా చందన, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి విజయ కుమారి, జిల్లా రవాణా అధికారి తోట కిషన్ రావు, జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ (TSCSCL) G. సోములు, మార్కెటింగ్ అధికారి నాగరాజ్, జిల్లా మేనేజర్ మార్క్ ఫెడ్ పి సునీత, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర రావు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు భద్రం, సత్యం బాబు తదితరులు ఉన్నారు.