ఖమ్మం వైద్య విభాగం (ప్రభ న్యూస్): ఖమ్మం జిల్లా పాలేరు నవోదయ విద్యార్థి దుర్గనాగేంద్ర బాబు మృతిచెందిన సంఘటనను నిరసిస్తూ, కారణమైన ప్రిన్సిపాల్‌ని అరెస్టు చేయాలనీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థులతో ప్రమాదకరమైనటువంటి విద్యుత్ పనులు చేయిస్తూ పొట్టన పెట్టుకున్న నవోదయ ప్రిన్సిపాల్ ను అరెస్టు చేయాలని విద్యార్థి సంఘః రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శిలు వెంకటేష్, మస్తాన్ డిమాండ్ చేశారు.
విద్యార్థి చనిపోయినా పాలేరు నవోదయకు చైర్మన్ అయిన ఖమ్మం జిల్లా కలెక్టర్ మృతదేహాన్ని సందర్శించకపోవడం బాధాకరమన్నారు. చదువుకోవడానికి వస్తున్న విద్యార్థుల చేత ప్రిన్సిపాల్ పనులు చేయిస్తూ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులచే పనులు చేయించడం వల్ల నలుగురు విద్యార్థులు విద్యుత్ ఘాతానికి గురవడం బాధాకరమని అన్నారు. తక్షణమే చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.